ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల ఏపీలో కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం పై ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో భాగంగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనలేదని స్పష్టం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు, 2019 మే నెల వరకు అప్పటి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్‌ను కొనలేదని తెలిపారు.
ఈ నేపధ్యంలో ప్రభుత్వ పదవిలో ఉండి మీడియాతో మాట్లాడటంపై ఆయనకు ఈ నోటీసులు జారీ చేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టారని ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. ఇక దీంతో పాటు ఏబీ వెంకటేశ్వరరావు కొందరు వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేయడానికి చీఫ్ సెక్రటరీ అనుమతి కూడా కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈ నోటీసు పై సరైన సమాధానం చెప్పాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.
ఇకపోతే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ స్పైవేర్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 25 కోట్లు చెల్లిస్తే పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఇస్తామంటూ తమ వద్దకు 3ఏళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని, అయితే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పిన మమతా బెనర్జీ, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పట్లో ఈ స్పైవేర్ వాడారని, ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే.