AP Budget 2022-23: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బడ్జెట్.. న‌వ‌ర‌త్నాల‌కే ల‌క్ష కోట్లా..?

  • Written By:
  • Publish Date - March 11, 2022 / 10:52 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా, ఈరోజు స‌భ‌లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్ర‌మంలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర‌ ప్రజల్లో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. స‌భ‌లో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్ఏనారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ బ‌డ్జెట్‌లోక సంక్షేమానికే జ‌గ‌న్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇక 2021-22లో రెండు లక్షల 30వేల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈసారి రాష్ట్ర బ‌డ్జెట్ రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధన్యాత ఇవ్వనున్నారని స‌మాచారం. ఈ క్ర‌మంలో నవరత్నాల అమలుకు దాదాపు లక్ష కోట్ల కేటాయింపు జరిపే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. రాష్ట్రంలో రాబడులను పెంచి అంచనాలను చూపించనున్నారు.

ఇక మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, వరుసగా రెండో ఏడాది జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేశారని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి తొలిసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు కోట్ల చొప్పున బడ్జెట్‌లో 350 కోట్లు కేటాయించనున్నారు. అలాగే వ్యవసాయరంగానికి 31 వేల కోట్ల కేటాయింపు జరిగినట్టు స‌మాచారం.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 10 వేల కోట్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి 4,500 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు 6,400 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకానికి 4,200 కోట్లు, అమ్మఒడి పథకానికి 6,500 కోట్లు, జగనన్న విద్యాదీవెన పథకానికి 2,400 కోట్లు సున్నా వడ్డీ పథకానికి 800 కోట్లు, కాపు నేస్తం పథకానికి 500 కోట్లు కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు స‌మ‌య ఉండటంతో, బడ్జెట్‌లో ఆ ప్రభావం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనిని ఎన్నికల బడ్జెట్ గానే ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు.