AP New District: కొత్త జిల్లాల ఏర్పాటు డేట్ ఫిక్స్..!

  • Written By:
  • Publish Date - March 30, 2022 / 04:59 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏప్రిల్ 4న ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. కొత్త సంవత్సరమైన ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేసి, ఏప్రిల్ 4వ తేదీన ఉద‌యం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో కొత్త జిల్లాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జ‌గ‌న్ చేతుల మీద‌గా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది.

ఇక ఇప్ప‌టికే కొత్త జిల్లాల‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటులో విషయంలో అభ్యంతరాలు, సూచనలు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. కొత్త జిల్లాలు ఏర్పాటయితే జవహర్ నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల లాంటి వాటిని కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని, 3 లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌గ‌న్ ఆదేశించారు.

ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా మాన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ, పార్వతీపురం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరుగనుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, సౌలభ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దులను నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌స్తుతం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండడంతో, దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఉగాది డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో, ఇప్ప‌టికే ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలను సమకూర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కొత్త జిల్లాల విష‌యం తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటును అడ్డ‌కోవాల‌ని పలువురు తీవ్రంగా ప్ర‌య‌త్నించి, అధికార ప్ర‌భుత్వం మాత్రం అన్ని అడ్డంకుల‌ను దాటుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహుర్తం ఫిక్స్ చేసింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.