Site icon HashtagU Telugu

Amaravati: ‘అమరావతి’ పై చేతులెత్తేసిన జగన్ సర్కార్

Amravathi

Amravathi

ఇటీవల అమరావతి గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాల్ని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం భారీ చర్చ పెట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఇది జగన్ సర్కార్ అమరవతిపై చేతులెత్తేసినట్టు అయింది. సీఎస్ సమీర్ శర్మ అమరావతి తీర్పుకు సంబంధించి 190 పేజీల అఫిడవిట్ ను హైకోర్టు కు సమర్పించారు. ఇందులో ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. హైకోర్టు తీర్పును అమలు చేసే క్రమంలో అమరావతిని అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్లు గడువు ఇవ్వాలని కోరారు. వాస్తవానికి సీఆర్డీయే చట్టం ప్రకారం చూసినా 2024 వరకూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆరునెలల్లో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం సాధ్యంకాదనే అంశాన్ని ఫైనల్ గా ఆయన హైకోర్టుకు తెలిపారు.

అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయితే అప్పటికే వీటిపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని, అమరావతిని మాత్రమే సీఆర్డీయే చట్టం ప్రకారం అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చింది. అంతే కాదు నెల రోజుల్లో రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఆరు నెలల్లో అమరావతిలో పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. వీటి వివరాల్ని ఎప్పటికప్పుడు అఫిడవిట్ల రూపంలో తమకు సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు శనివారం సుదీర్ఘ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది