Site icon HashtagU Telugu

AP farmers suicides: ఏపీలో గత 3ఏళ్లలో 1,673 రైతు ఆత్మహత్యలు!

Farmers suicide

Farmers Imresizer

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు.

2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది.

కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు సంభవించాయని తెలిపింది. 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2017, 2018 సంవత్సరాలతో పోల్చితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2017లో తెలంగాణాలో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 352 కు తగ్గిందని పేర్కొంది. దక్షిణ భారతంలో అధిక ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది. కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.