Site icon HashtagU Telugu

AP PRC : జ‌గ‌న్ పై క‌య్యానికి ఉద్యోగుల ‘సై’

Jagan Effect

Ap Employees

ఉద్యోగులు స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకుంటారు. మేధావులుగా భావిస్తోన్న ఉద్యోగ సంఘాల నేత‌లు ఏపీ సీఎం జ‌గ‌న్ తో క‌య్యానికి కాలుదువ్వుతున్నారు. అమ‌రావ‌తి జేఏసీతో చేతులు క‌లిపారు. దీంతో ఈ పోరాటం రాజ‌కీయ‌ రంగును సంత‌రించుకోనుంది. స‌మ‌స్య‌ను మ‌రింత జ‌ఠిలం చేసుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌చివాల‌యం ఉద్యోగుల్లోని ఒక వ‌ర్గం టాక్‌. అమ‌రావ‌తి జేఏసీతో క‌లిసి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించ‌డానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు రెడీ అయ్యారు.అమ‌రావ‌తి జేఏసీ రాజ‌ధాని కోసం రెండేళ్లుగా పోరాడుతోంది. ప్ర‌భుత్వం ఆ క‌మిటీతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేదు. పైగా అసెంబ్లీ బ‌య‌ట‌లోప‌ల అమ‌రావ‌తి జేఏసీ పైన వైసీపీ విమ‌ర్శ‌ల‌ను గుప్పించింది. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని చంద్ర‌బాబు న‌డిపిస్తున్నాడ‌ని ఆ పార్టీ నేత‌లు ఆరోపించారు. జేఏసీని కూడా తెలుగుదేశం పార్టీ న‌డిపిస్తోంద‌ని వైసీపీ అనేక వేదిక‌ల‌పై ఆరోప‌ణ‌లు చేసింది. అంతేకాదు, అమ‌రావ‌తి జేఏసీ సేక‌రించిన నిధుల‌పై కూడా ప్ర‌భుత్వం ఒక క‌న్నేసింది. ప్ర‌భుత్వానికి, అమ‌రావ‌తి జేఏసీకి మ‌ధ్య రాజ‌కీయ కోణంలో ప్ర‌చ్ఛ‌న్న‌యుద్దం జ‌రుగుతోంది.

ఇప్పుడు అమ‌రావ‌తి జేఏసీతో ఉద్యోగ సంఘాల జేఏసీ చేతులు క‌ల‌ప‌డం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. తొలి విడ‌త ఉద్యోగ సంఘాల పోరాటం వైఫ‌ల్యం తెర మీద‌కు వ‌స్తోంది. ఆనాఉ ఉద్య‌మ‌ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించిన త‌రువాత ఆక‌స్మాత్తుగా విర‌మించుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వాటి నుంచి బ‌య‌ట‌పడేందుకు ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ఎత్తుగ‌డ‌ను ఉద్యోగ సంఘాల నేత‌లు అందుకున్నార‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.పీఆర్సీ మీద సీఎస్ క‌మిటీ ఒక నివేదిక‌ను ఇచ్చింది. ప్ర‌భుత్వం ఆర్థిక ప‌రిస్థితి గురించి జ‌గ‌న్ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల‌, ఆర్థిక మంత్రి బుగ్గ‌న తెలియ‌చేశారు. ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో ప‌లుమార్లు స‌మావేశం అయ్యారు. ఫిట్ మెంట్ 14.09శాతం మించి ఇవ్వ‌లేమ‌ని ప్ర‌భుత్వం తేల్చేసింది. దీంతో జ‌గ‌న్ ను ఉద్యోగ సంఘాల నేత‌లు భేటీ అయ్యారు. అక్క‌డ ఏమి జ‌రిగిందో..ఎవ‌రికీ తెలియ‌దు. సీఎం నుంచి ఎలాంటి హామీ వ‌చ్చిందో చెప్ప‌కుండానే సైలెంట్ గా ఉద్య‌మాన్ని ఆనాడు విర‌మించారు. ఉద్యోగుల డిమాండ్ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ న‌డుస్తున్నాయి. రెండేళ్లుగా కోవిడ్ కార‌ణంగా సామాన్యుల జీవితాలు చితికిపోయాయి. ధ‌ర‌లు పెరగ‌డంతో పేద‌లు జీవ‌నం సాగించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యోగుల‌కు జీతాల‌ను పెంచాలంటే ప‌న్నులు వేయాలి.

Also Read : ఢిల్లీ చ‌ట్రంలో జ‌గ‌న్‌.!

ఇప్ప‌టికే జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత సుమారు 12వేల కోట్ల మేర‌కు ఉద్యోగులు ల‌బ్ది పొందారు. కొత్త ఉద్యోగ నియామ‌కాలు,డీఏలు ఇత‌ర‌త్రా ల‌బ్ది రూపంలో 12వేల కోట్ల‌కు పైగా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చింది. ఉచితంగా ఉద్యోగుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాలను క‌ల్పించారు. అయిన‌ప్ప‌టికీ అవినీతి రెండంకెల‌ను దాటింది. తాజాగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నివేదిక‌లో అవినీతి తారాస్థాయికి చేరింది. ఇలాంటి ప‌రిణామాలు ఉద్యోగుల జీతాల పెంపుపై సామాన్యుల్లో ఆగ్ర‌హం క‌లుగుతోంది.పీఆర్స్ అంటే…జీతాలు పెంచాల‌ని ఎక్క‌డా లేదు. మాన‌వాభివృద్ధి సూచిక ప్ర‌కారం ఏపీ రాష్ట్రంలో ధ‌నికులు, పేద‌ల మ‌ధ్య అంత‌రం భారీగా ఉంది. ఆ విష‌యంలో బీహార్ రాష్ట్రం కంటే ఏపీ ర్యాంకు దారుణంగా ఉంది. ఈ సూచిక ప్ర‌కారం పీఆర్సీని నిర్థారిస్తే ఇప్పుడున్న జీతాల‌ను కూడా త‌గ్గించాలి. అదే విష‌యాన్ని పీఆర్సీ క‌మిటీ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. దీంతో అమ‌రావ‌తి జేఏసీ తో క‌లిసి ప్ర‌భుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాల నేత‌లు నిర్ణ‌యించారు. ఫ‌లితంగా జ‌గ‌న్ , ఉద్యోగ జేఏసీ మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం ప్రారంభం కానుంది. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ ఎలాంటి పావులు క‌దుపుతాడో..చూడాలి.