KCR and Jagan: కేసీఆర్ కు ఏపీ సీఎం జ‌గ‌న్ ఫిట్టింగ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ కు స‌రైన స‌మ‌యంలో స‌రైన ఫిటింగ్ పెట్టారు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 02:57 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కు స‌రైన స‌మ‌యంలో స‌రైన ఫిటింగ్ పెట్టారు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. జాతీయవాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్ ను ఇరుకున‌పెట్టేలా ఉద్యోగుల అంత‌ర్రాష్ట్ర బ‌దిలీ అంశాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత అంత‌ర్రాష్ట్ర బ‌దిలీల‌పై వివాదం నడుస్తోంది. ఏపీ ప్ర‌భుత్వం ఇంత‌కాలం ఏటూ తేల్చుకోలేని ప‌రిస్థితుల్లో నిమ్మ‌కుండి పోయింది. తాజాగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆ ఫైల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ కు ఇప్పుడు త‌ల‌నొప్పి ప్రారంభం అయింది.

తొలి నుంచి ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు అక్క‌డ ప‌నిచేయడానికి అయిష్టంగా ఉన్నారు. అంతేకాదు, న్యాయ‌పోరాటం కూడా చేస్తున్నారు. ఏపీ ఉద్యోగులు కూడా వీలున్నంత వ‌ర‌కు డిప్యూటేష‌న్ పై తెలంగాణ స‌ర్కార్లో ప‌నిచేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌చివాల‌య‌, విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువ‌గా అంత‌రాష్ట్ర బ‌దిలీల‌ను కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే విభ‌జన చ‌ట్టం ప్ర‌కారం ఎక్కువ మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగులు ఏపీ ఖాతాలోకి వ‌చ్చారు. వాళ్ల పెన్ష‌న్ భారాన్ని మోయ‌లేక ఏపీ స‌ర్కార్ నానా తంటాలు ప‌డుతోంది. ఆ క్ర‌మంలో తెలంగాణ ఉద్యోగుల‌ను సాగ‌నంప‌డానికి జ‌గ‌న్ స‌న్న‌ద్ధం అయ్యారు.

ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల సంఖ్య సుమారు 1,804గా ఉంది. అదే స‌మ‌యంలో తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల సంఖ్య‌ 1,338గా ఉంద‌ని తెలుస్తోంది. వీరంతా ఇరు ప్ర‌భుత్వాల‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఎన్ఓసీలు ఇస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వంలో ప‌నిచేయడానికి ఇష్ట‌ముండే ఉద్యోగుల‌కు ఎన్ ఓసీలు తెలంగాణ స‌ర్కార్ ఇవ్వాలి.

జాతీయ వాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్‌ ఇటీవ‌ల ప్రాంత‌, మ‌త‌, కుల విద్వేషాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఒక‌ప్పుడు ప్రాంతీయ విద్వేషాన్ని లేపిన ఆయ‌న ఇప్పుడు ఫుల్ రివ‌ర్స్ థింకింగ్ లో ఉన్నారు. రాబోవు రోజుల్లో జాతీయ పార్టీ పెట్ట‌డంతో పాటు జాతీయ‌తావాదాన్ని అందుకోబోతున్నారు. అంతేకాదు, విప‌క్షాల ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఫోక‌స్ అవుతున్నారు. ఆ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అంతరాన్ని చెర‌పేయ‌డానికి అంత‌రాష్ట్ర బ‌దిలీల విష‌యంలో తొలి అడుగు వేయాల్సి ఉంటోంది. లేదంటే , ఆయ‌నపై ఉన్న ప్రాంతీయ ముద్ర పెరిగితే జాతీయ రాజ‌కీయాల్లో ఇదో వ్య‌తిరేక అంశంగా ఆయ‌న‌కు మారే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే, జ‌గ‌న్ స‌రైన టైమ్ లో కేసీఆర్ కు అంత‌ర్రాష్ట్ర ఇష్యూని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూద్దాం.