AP Employees Tension: ఏపీలో పీఆర్సీపై జీవోలు ఏమయ్యాయి? రికవరీలకు ఆదేశాలు ఇవ్వలేదెందుకు?

ఏపీలో ఉద్యోగుల వెతలు ఇప్పటికీ తీరడం లేదు. పీఆర్సీ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 02:35 PM IST

ఏపీలో ఉద్యోగుల వెతలు ఇప్పటికీ తీరడం లేదు. పీఆర్సీ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 11వ పీఆర్సీ గురించి టెన్షన్ ఇంకా తగ్గలేదు అనుకుంటే.. వచ్చే ఏడాది జూలైలో 12వ పీఆర్సీ కమిషన్ కూడ వేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం కూడా మదనపడుతోంది. పాత పీఆర్సీ హామీలను నెరవేర్చకపోవడంతో ఉద్యోగుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పే రివిజన్ ను ఐదేళ్లకు ఓసారి చేస్తారా లేదా అన్నది వారికి అర్థం కాకుండా పోయింది. దీంతోపాటు మూడు నెలల కిందట మంత్రుల కమిటీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడంతో.. అసలేం జరుగుతుందా అన్నది ఉద్యోగులకు అర్థం కావడం లేదు.

ఇప్పుడు ఉద్యోగులతోపాటు టీచర్లలోనూ ఒకటే టెన్షన్. అంతకుముందు చెప్పినట్టుగా రికవరీల రద్దుపై ఆర్డర్స్ ఇంకా రాలేదు. సీసీఎస్ అంశం కొరకరాని కొయ్యలా మారుతున్నా సరే దానిని పట్టించుకోవడం లేదు. అసలు దీనిపై ప్రభుత్వం ఏం చేయానుకుంటుందో బయటపెట్టడం లేదు. నిజానికి పీఆర్సీపై ఈ ఏడాది జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అవి తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా
ఉన్నాయంటూ ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేపట్టాయి.

ఫిబ్రవరి 3న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు దిగ్విజయంగా నిర్వహించారు. అప్పటికి కాని ప్రభుత్వానికి ఉద్యోగుల పవర్ ఏమిటో అర్థంకాలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలంటూ మంత్రుల కమిటీకి పని అప్పజెప్పింది. చివరకు ఇరువర్గాల మధ్యా ఫిబ్రవరి 5న అగ్రిమెంట్ ఓకే అయ్యింది. ఈమేరకు ఫిబ్రవరి 20న కొన్ని ఆదేశాలను ఇచ్చింది. ఆ తరువాత ఇప్పటివరకు మిగిలిన అంశాల పై ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఎంప్లాయిస్ లో టెన్షన్ పెరుగుతోంది.

ఉద్యోగులతో కుదిరిన ఒప్పందం మేరకు అన్ని రకాల రికవరీలను నిలిపివేస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవు. సీపీఎస్ రద్దుపై మార్చి 30లోగా రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదు. పైగా ఏప్రిల్ 25న గ్యారంటీ పింఛన్ స్కీమ్ పేరుతో కొత్త స్కీమును తెరపైకి తెచ్చింది. ఇది ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని ఇంకా పెంచింది.
ఐదేళ్లకోసారి పీఆర్సీ వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. దాని ప్రకారం చూసినా వచ్చే ఏడాది జూలైకి కచ్చితంగా 12వ పీఆర్సీ కమిషన్ వేయాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉండడంతో ప్రభుత్వం ఏం చేస్తుందా అని ఉద్యోగులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.