AP Employees : ఏపీ ఉద్యోగుల మోనార్కిజం

రౌతు మెత్త‌నైతే గుర్రం దానంత‌ట అది ఇష్టానుసారంగా వెళుతుంద‌ని సామెత‌. ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌రిస్థితి కూడా ఆ సామెత‌లా ఉంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత గొంతెమ్మ కోర్కెల‌ను చంద్ర‌బాబు ద్వారా తీర్చుకున్నారు

  • Written By:
  • Updated On - April 27, 2022 / 05:36 PM IST

రౌతు మెత్త‌నైతే గుర్రం దానంత‌ట అది ఇష్టానుసారంగా వెళుతుంద‌ని సామెత‌. ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌రిస్థితి కూడా ఆ సామెత‌లా ఉంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత గొంతెమ్మ కోర్కెల‌ను చంద్ర‌బాబు ద్వారా తీర్చుకున్నారు. డ‌బుల్ హెచ్ ఆర్ ఏ, హైద‌రాబాద్ నుంచి అమరావ‌తి వెళ్ల‌డానికి ప్ర‌త్యేక బ‌స్సులు-రైళ్లు, తిన‌డానికి ఉచితంగా భోజ‌నం, వారానికి ఐదు రోజుల ప‌నిదినాలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు చంద్ర‌బాబును బెదిరించి ఏపీ ఖ‌జానాను ఉద్యోగులు నాకేశారు. తెలంగాణ ఉద్యోగుల‌తో స‌మానంగా ఫిట్మెంట్ తీసుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయంతో స‌మానంగా పెంచ‌లేక‌పోయారు. కేవ‌లం హ‌క్కుల కోసం పోరాడే ఉద్యోగులు బాధ్య‌త‌ల‌ను మ‌ర‌చిపోతున్నారు. అవినీతిని రెండంకెల‌ను దాటించారు. లంచం ఇవ్వ‌కుండా ప‌నిచేయించుకోవ‌డం సాధ్యమా? అనేది వాళ్లే ఆలోచించుకోవాలి.

ఇప్పుడు మ‌ళ్లీ సీపీఎస్ ర‌ద్దుకు డిమాండ్ చేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చారు. సెల‌వులు కూడా వాళ్లు అడిగిన‌న్న ఇవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించాల‌ని కోరుకుంటున్నారు. ఓట్ల కోసం ప్ర‌భుత్వ ఉద్యోగుల పంచ‌న విప‌క్షాలు చేరుతున్నాయి. దీంతో ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని ఎమ‌ర్జెన్సీ స్థాయికి తీసుకెళ్లారు. సామాన్యుడు మూడు పూట‌లా అన్నం కూడా తిన‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగులు మాత్రం వాళ్ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేసుకుని జీతాలు తీసుకుంటున్నారు. ఇదేమి ప‌ద్ద‌తి అనే అడిగే దమ్మున్న ప్ర‌భుత్వం లేక‌పోవ‌డం ప్ర‌జ‌ల దుర‌దృష్టం. ఏపీ సీఎం జ‌గ‌న్ కొన్ని రోజులు వాళ్ల‌ను కంట్రోలు చేయ‌గ‌లిగారు. కానీ, ఆయ‌న కూడా ఇప్పుడు దాసోహం అంటూ ఓట్ల కోసం సామాన్యుల క‌ష్టాన్ని దోచిపెడుతున్నారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) స్థానంలో గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) పేరిట కొత్త స్కీమ్ కింద రిటైర్మెంట్ అయ్యాక కనీసం 33.5 శాతం పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగ సంఘాల ముందే జీపీఎస్‌పై ప్రతిపాదన చేసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వ‌డం ద్వారా వాళ్ల మ‌న్న‌న‌లు పొందాల‌ని తాప‌త్ర‌య‌ప‌డింది.

ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నాయకులు నిర్ధ్వందంగా తిరస్కరించారు. ఆ మేరకు రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానం 1.9.2004 తర్వాత చేరిన వారికి ఇబ్బందిగా ఉందన్నారు. ఓపీఎస్‌కు వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతుందని జీపీఎస్ పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయ‌న చెబుతున్నారు. ఇలా స్టేట్ ఫండ్ ఏర్పాటు చేసి చెల్లిస్తామని గతంలో టక్కర్ కమిటీ చెప్పినా తాము అంగీకరించలేదని బొప్పరాజు గుర్తు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. జీపీఎస్ స్కీమ్‌ను తాము ఆమోదించేది లేదని చెప్పినట్లు వెల్లడించారు. ఇళ్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే, చుట్ట‌కు నిప్పు ఇవ్వ‌మ‌ని ఎవ‌డో అడిగిన‌ట్టు ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌రిస్థితి ఉంది. రాష్ట్రం దివాళా మార్గంలో ఉంటే, ప్ర‌భుత్వ ఉద్యోగులు పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు అంటూ డిమాండ్ చేయ‌డం వాళ్ల విజ్ఞ‌త‌కే వ‌దిలేయాలి.