Chalo Vijayawada : అమ‌రావ‌తి కంటే ఉద్యోగుల ఉద్య‌మం హిట్‌

ఉద్య‌మాల‌ను ఒక‌దానితో మ‌రొక‌టి పోల్చుతుంటారు. స్వాతంత్ర్య ఉద్య‌మాన్ని, తెలంగాణ ఉద్య‌మాన్ని అప్ప‌ట్లో కేసీఆర్ పోల్చే వాళ్లు.

  • Written By:
  • Updated On - February 3, 2022 / 08:23 PM IST

ఉద్య‌మాల‌ను ఒక‌దానితో మ‌రొక‌టి పోల్చుతుంటారు. స్వాతంత్ర్య ఉద్య‌మాన్ని, తెలంగాణ ఉద్య‌మాన్ని అప్ప‌ట్లో కేసీఆర్ పోల్చే వాళ్లు. అహింస‌ను ఆయుధంగా చేసుకుని పోరాడుదాం అంటూ కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సంద‌ర్భాలు అనేకం. అలాగే, నాడు జ‌రిగిన‌ చలో అమ‌రావ‌తి కార్య‌క్ర‌మాన్ని ఇవాళ జ‌రిగిన చ‌లో విజ‌య‌వాడ‌ను పోల్చడం స‌హ‌జం. ఏపీ రాష్ట్రానికి అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు అక్క‌డి రైతులు. నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం చేస్తూ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ అందుకోసం ఏర్ప‌డింది. ఆ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఎప్పుడూ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూనే ఉంటాయి. ఆ కార్య‌క్ర‌మాల‌కు దాదాపు అన్ని రాజ‌కీయ పార్టీల మ‌ద్థ‌తు ఉంది. అయిన‌ప్ప‌టికీ ఏనాడూ చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం మాదిరిగా హిట్ కాలేద‌ని ఉద్యోగుల భావ‌న‌.అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం సుమారు 33 వేల ఎక‌రాల‌ను రైతులు స్వ‌చ్చంధంగా ఇచ్చారు. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ఆనాడు చెప్పింది. అందుకోసం వ్యాపార‌, గృహాల కోసం ప్లాట్ల‌ను తిరిగి రైతుల‌కు ఇచ్చే అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా స్వ‌చ్చంధం అంటూ ప్ర‌చారం చేశారు. రాజ‌ధాని భూమి పూజ చేయ‌డానికి ముందే అక్క‌డి భూముల ధ‌ర‌లు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ‌గా పలికాయి. సామాన్యుడికి ఏ మాత్రం అంత‌నంతగా ధ‌ర‌ల‌ను పెర‌గ‌డంతో వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి. అదే స‌మ‌యంలో నోట్ల ర‌ద్దుకు సంబంధించిన ప్ర‌చారం కూడా జ‌రిగింది. దాంతో అక్క‌డి భూముల ధ‌ర ఎక‌రం రూ. 4 కోట్ల నుంచి రూ. 8కోట్ల వ‌ర‌కు కూడా వెళ్లింది. ఆ స‌మయంలో జ‌రిగిన లావాదేవీల క్ర‌మంలో రైతులు అమ్ముకున్నార‌ని వైసీపీ చెబుతోంది.

ఒక సామాజిక‌వ‌ర్గం కోసం చంద్ర‌బాబునాయుడు ఏర్పాటు చేసిన రాజ‌ధానిగా వైసీపీ ఫోక‌స్ చేసింది. అందుకే, మూడు రాజ‌ధానుల అస్త్రాన్ని తెర‌మీద‌కు జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చింది. అప్ప‌టి నుంచి అమ‌రావ‌తి రైతులు 29 గ్రామాల్లో ధ‌ర్నాలు, రాస్తారోకోలు, చ‌లో అమ‌రావ‌తి..ఇలా ర‌క‌ర‌కాలుగా ఆందోళ‌న చేశారు. ప్ర‌భుత్వం ఛాలెంజ్ గా తీసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు రైతుల ఆందోళ‌న‌ల‌ను అణిచివేసింది. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహర‌ణ‌తో రైతులు కొంత మేర‌కు వెన‌క్కు త‌గ్గారు. అయితే, వాళ్లు చేసిన సుమారు రెండేళ్ల ఉద్య‌మ స‌మ‌యంలో ఏనాడూ చ‌లో విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు వ‌చ్చినంత మంది రాలేద‌ని వైసీపీ భావిస్తోంది.విజ‌య‌వాడ వీధుల‌న్నీ ఉద్యోగుల‌తో నిండిపోయాయ‌ని విజువ‌ల్స్ ఆధారంగా తెలుస్తోంది. ఉద్యోగుల వైపు నుంచి ప్ర‌భుత్వంపై ఆ మేర‌కు వ్య‌తిరేక‌త ఉందా? అంటే నిఘా వ‌ర్గాలు ఇచ్చిన అభిప్రాయం ప్ర‌కారం లేద‌ని ప్ర‌భుత్వానికి అందిన స‌మాచారమ‌ట‌. మ‌రి, వేలాది మంది చ‌లో విజ‌య‌వాడ‌కు ఎలా వ‌చ్చారు? పోలీసులు ఏమి చేస్తున్నారు? పెద్ద ఎత్తున లెగిసిన ఉద్య‌మాల‌నే పోలీసులు కంట్రోల్ చేస్తారు. మూడు రాజధానుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇచ్చిన చ‌లో అమ‌రావ‌తి కార్య‌క్ర‌మానికి కూడా ఇంత భారీ స్పంద‌న క‌నిపించ‌లేదు. అంటే, పోలీసులు ఉద్యోగుల‌ను వ‌దిలేశారా? రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి త‌ర‌లి వ‌చ్చిన ఉద్యోగుల‌ను కంట్రోల్ చేయ‌లేక పోలీసులు చేతుల్తేశారా? అంటే..ఏదో వ్యూహం దీనిలో ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

విజ‌య‌వాడ కేంద్రంగా న‌డిచిన అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని పోల్చడానికి చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం అయ్యేలా ప్ర‌భుత్వ‌మే స‌హ‌కారం అందించిందా? లేక ఉద్యోగుల వెనుక రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయాన్ని నిరూపించ‌డానికి స‌ర్కార్ స‌హ‌నంగా ఉందా? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధాని కావాల‌ని ఏనాడూ ప్ర‌జ‌లు ఇంత పెద్ద ఎత్తున రాలేద‌ని వైసీపీ ఇక నుంచి ప్ర‌శ్నించ‌డానికి చ‌లో విజ‌య‌వాడ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆ ఉద్య‌మంలో పాల్గొన్న వాళ్ల వివ‌రాల‌ను ప్ర‌భుత్వం నిశితంగా ప‌రిశీలిస్తోంది. త్వ‌ర‌లోనే వాళ్ల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్ట‌డం ద్వారా విప‌క్షాల నైజాన్ని జ‌నానికి తెలియ‌చేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంద‌ని తెలుస్తోంది. దానిలో నిగూఢ వ్యూహం ఏమిటో త్వ‌ర‌లోనే బయ‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికైతే, అమ‌రావ‌తి ఉద్య‌మం కంటే చ‌లో విజ‌య‌వాడ హిట్ టాక్ వ‌చ్చేసింది. ఫ‌లితంగా అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని బ‌ల‌హీన‌మైన‌దిగా చూపే ప్ర‌య‌త్నం వైసీపీ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.