AP Elections : ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.. ఇవాళ ఏపీకి రాహుల్, నడ్డా
Pasha
Ap Elections 2024 Nadda Rahul
AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచార ఘట్టం ముగియనుంది. ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు కడప విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11.45 గంటలకు ఇడుపులపాయకు రాహుల్ చేరుకుంటారు. ఆ వెంటనే వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. ఆ తరువాత ఒంటి గంట సమయంలో కడపలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇవాళ తిరుపతిలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుపతిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు జేపీ నడ్డా రోడ్‌షో జరగనుంది. ఇందులో జనసేన నేత నాగబాబుతో పాటు టీడీపీ, జనసేన ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
ఇవాళ చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని(AP Elections) చిత్తూరు సభతో చంద్రబాబు ముగించనున్నారు. చిత్తూరు సభ ముగిసిన తర్వాత నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి తిరుపతి వెంకన్న స్వామివారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.
ఇవాళ కాకినాడలో రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటారని తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ బహిరంగ సభపై సస్పెన్స్ నెలకొంది. బహిరంగ సభకు రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసులు ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే కాకినాడలో ర్యాలీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ తీసుకుంది. ఇదే సమయంలో జనసేన బహిరంగ సభ ఉండడంతో.. రెండు పార్టీలకు అనుమతి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. కాకినాడ సిటీ పరిధిలో ఎక్కడ సభకు అనుమతి ఇచ్చినా ఇబ్బంది లేదని అధికారుల దృష్టికి కూటమి నేతలు తీసుకెళ్లారు.
ఈ రోజు సీఎం వైఎస్ జగన్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.