AP: కొత్త జిల్లాల ఏర్పాటులో ట్విస్ట్.. ఆ ఉత్తర్వుల సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వడం, తరువాత జీవోలు ఇవ్వడం..

  • Written By:
  • Updated On - March 13, 2022 / 12:59 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వడం, తరువాత జీవోలు ఇవ్వడం.. ఇవన్నీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీకి విరుద్ధమని, వాటిని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తజిల్లాలను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చకుండా జిల్లా విభజన చేయాలంటే కష్టం.

జిల్లాను ఒక యూనిట్ గా తీసుకోవడం కాని, జోన్ ను ఒక యూనిట్ గా తీసుకోవడం కాని.. వాటి ద్వారా ఉద్యోగాలను ఇవ్వడం, విద్యాలయాల్లో సీట్లను కేటాయించడం.. ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జరుగుతాయి. 1975 అక్టోబర్ 18 రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలు దీనిని స్పష్టం చేస్తాయి. ఆర్టికల్ 371-డీ ద్వారా సంక్రమించిన అధికారాలతోనే ఇదంతా జరుగుతుంది. మరి కొత్త జిల్లాల ఏర్పాటువల్ల కలిగే నష్టమేంటి? ఎందుకు దీనిపై అభ్యంతరాలు వస్తున్నాయి?

కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమంటూ జరిగితే.. దాని వల్ల ఆ పరిధిలో పనిచేసే ఉద్యోగులంతా స్థానిక పరిధిని కోల్పోతారు. ఎందుకంటే ఉద్యోగ నియామకాలు జిల్లా యూనిట్ గా చేస్తారు. సో, కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తే వారికి సీనియారిటీ సమస్య వస్తుంది. పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య.. వీటి కోసం ఏపీ విభజనం చట్టంలో సెక్షన్ 97 ఉంది. మరి దీనిని ఎలా విస్మరిస్తారు? అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించేవరకు జిల్లాలను విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదంటున్నారు పిటిషనర్లు. పైగా ఆర్డర్ టూ సర్వ్ ప్రకారం కొత్త జిల్లాలకు సిబ్బందిని కేటాయించే పవర్ రాష్ట్రపతికే ఉందని గుర్తుచేస్తు్న్నారు

ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టం 1974ను కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. దీని ప్రకారం చూసినా.. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన 8 వేలకు పైగా అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలి. కానీ అవేవీ చేయకుండానే కొత్త జిల్లాల్లో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఫిబ్రవరి 26న జీవో ఇచ్చిందన్నారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే.. ఇప్పుడున్న జిల్లాను రెండు మూడు జిల్లాలుగా విభజిస్తే.. ఆ జిల్లాల్లో ఉద్యోగ నియామకాల అధికారాలు కలెక్టర్లకు రావాలంటే.. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా దానికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంది. అందుకే ఈమధ్యే ఉద్యోగాల ప్రకటనను చేయగలిగిందంటున్నారు నిపుణులు.