Site icon HashtagU Telugu

AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. నేటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Jai Congress

Jai Congress

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం హీటెక్కింది. అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను విడ‌త‌ల వారీగా ప్ర‌క‌టిస్తుంది. ఇటు టీడీపీ జ‌న‌సేన పార్టీలు పొత్తులో సీట్ల కేటాయింపుల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. మ‌రోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా వైఎస్ షర్మిల‌ను హైక‌మాండ్ నియ‌మించింది. ష‌ర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తరువాత ఆమె జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. వైఎస్ఆర్ కెబినెట్‌లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప‌ని చేసిన వారంద‌రిని క‌లుస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నేటి (బుధవారం) దరఖాస్తులు సేకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. ఏపీసీసీ వ్యవహారాల చీఫ్‌ మాణికం ఠాగూర్‌ బుధవారం విజయవాడకు వచ్చి కాంగ్రెస్‌ నేతల నుంచి దరఖాస్తుల సేకరణ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు పార్టీ దరఖాస్తులను సేకరిస్తుందని ఆయ‌న తెలిపారుజ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల వ‌చ్చిన త‌రువాత అధికార వైసీపీ భయపడుతోందన్నారు. ఉత్తరాంధ్రలో షర్మిల పర్యటన కార్యక్రమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు స్పందిస్తుండడం వల్లే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు షర్మిలకు భయపడుతున్నారని ఆయన అన్నారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

Also Read:  Ayodhya Ram Mandir: తొలిరోజే అయోధ్య రామమందిరం రికార్డు… బాల రాముడిని ద‌ర్శించుకున్న 5 లక్షల మంది భ‌క్తులు..!