Site icon HashtagU Telugu

KVP : రంగంలోకి రాజకీయ మాంత్రికుడు.. వైసీపీ అసంతృప్తులు టార్గెట్‌గా వ్యూహరచన

Kvp Sharmila

Kvp Sharmila

KVP : కేవీపీ.. రాజకీయ మాంత్రికుడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పరిస్థితులు కలిసొస్తే కేవీపీ రాజకీయ వ్యూహాలు అమోఘంగా పనిచేస్తాయని అంటారు.ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిలకు పగ్గాలు దొరకడం వెనుక కూడా ఆయన ఉన్నారని చెబుతున్నారు. షర్మిల చరిష్మాతో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి ఏ మాత్రం స్పందన వచ్చినా.. దాన్ని అందిపుచ్చుకునే ప్లాన్‌ను తెరవెనుక నుంచి కేవీపీ రెడీ చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన హైదరాబాద్ నుంచి షర్మిలతో పాటే ఏపీకి వచ్చేశారు. షర్మిల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. నా మేనకోడలు అని మీడియా ముందు చెప్పి కాంగ్రెస్ కోసం ఆమెకు అండగా ఉంటానని కేవీపీ హామీ ఇచ్చేశారు. ప్రస్తుతం కేవీపీ(KVP).. కొందరు వైసీపీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరికి టికెట్లు రావో వారిని.. అలాగే వైఎస్సార్ సీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను సంప్రదించే ప్రయత్నంలో ఆయన ఉన్నారట. అలాంటి వారితో మాటామంతీ కలిపి కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ట్రై  చేస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ షర్మిల ఈ నెల 23 నుంచి  జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఆమె పర్యటన మొదలవుతుంది. కేవీపీ సంప్రదిస్తున్న నేతలు ఆయా జిల్లాలలో షర్మిల పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌లో చేరుతారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కి ఎంతో కొంత చెప్పుకోదగిన నాయకులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జేడీ శీలం, పల్ల రాజు వంటి వారు ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులుగా చేసిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్ వంటి వారూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జనంలో లేకపోయినా భావజాలం అయితే ఉంది. ప్రతీ ఊరిలో కాంగ్రెస్ గుర్తు తెలియని వారు ఎవరూ లేరు. కాంగ్రెస్ కి కావాల్సింది ఎపుడూ లీడ్ చేసే వారు. ఇమేజ్ ఉన్న వారు పార్టీని లీడ్ చేస్తే మిగిలినవి చేసుకోవడానికి చాలా మంది తయారుగా ఉంటారు. ఇపుడు షర్మిల వైఎస్సార్ తనయగా కాంగ్రెస్ పగ్గాలు అందుకుంది. ఈ అడ్వాంటేజీని కాంగ్రెస్‌కు టర్నింగ్ పాయింట్‌గా మలిచే ప్రయత్నంలో కేవీపీ బిజీగా ఉన్నారని సమాచారం.

Also Read: Ayodhya Ram Ornaments : అయోధ్య రామయ్య ఆభరణాల జాబితా ఇదీ..