Bharat Jodo Yathra : `ప్ర‌త్యేక హోదా`పై ఏపీలో కాంగ్రెస్ బొమ్మ‌రిల్లు

ఉమ్మ‌డి ఏపీని విభ‌జించిన కాంగ్రెస్ ఏపీలో ఉనికి కోల్పోయింది. ఆ పార్టీని, సింబ‌ల్ ను మ‌రిచిపోయారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోట‌గా ఉన్న ఏపీని శాశ్వ‌తంగా జార‌విడుచుకుంది. మ‌ళ్లీ ఆ పార్టీని బ‌తికించ‌డానికి `ప్ర‌త్యేక హోదా` అనే అస్త్రాన్ని విసురుతోంది.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 03:24 PM IST

ఉమ్మ‌డి ఏపీని విభ‌జించిన కాంగ్రెస్ ఏపీలో ఉనికి కోల్పోయింది. ఆ పార్టీని, సింబ‌ల్ ను మ‌రిచిపోయారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోట‌గా ఉన్న ఏపీని శాశ్వ‌తంగా జార‌విడుచుకుంది. మ‌ళ్లీ ఆ పార్టీని బ‌తికించ‌డానికి `ప్ర‌త్యేక హోదా` అనే అస్త్రాన్ని విసురుతోంది. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా, యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్‌, మాజీ మంత్రులు జై రామ్ రమేష్ లు ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదాకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని వెల్ల‌డించారు. తాజాగా భార‌త్ జోడో యాత్ర ఏపీలో కొన‌సాగుతోన్న సమ‌యంలో ప్ర‌త్యేక హోదా ను కాంగ్రెస్ మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌ద‌ని జోడో యాత్ర చైర్మ‌న్ దిగ్విజ‌య్ సింగ్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ లేదా యూపీఏ అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని ఆ పార్టీ చెబుతోంది. కానీ, యూపీఏ కూట‌మిలో డీఎంకే ఉంది. రాబోవు రోజుల్లో యూపీఏకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా యూపీయే ఇవ్వ‌గ‌ల‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. ఎందుకంటే, త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్ర‌త్యేక హోదాను కోరుకుంటున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తే మాకు ఇవ్వాల‌ని ఇటీవ‌ల కేంద్రం ముందు డిమాండ్ ఉంచిన విష‌యం విదిత‌మే.

ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో దిగ్విజ‌య్ సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ యాత్రకు హృదయపూర్వక స్వాగతం పలికిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం తమకే సాధ్యమని తేల్చిచెప్పారు. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఇదే హామీతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని వివరించారు. తెలంగాణ విషయంలో హామీని నిలబెట్టుకున్నామని, ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటామని ప్రామిస్ చేశారు. ఆ విషయంలో బీజేపీ పార్టీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రులను మోసం చేశారని దిగ్విజయ్ ఆరోపించారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించాక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇచ్చామనే విషయం స్వయంగా రాహుల్ గాంధీనే చెబుతారని దిగ్విజయ్ వివరించారు. విద్వేష రాజకీయాలు, హింసపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ వెలుప‌ల టీఆర్ఎస్ కు గానీ బీఆర్ఎస్ కు గానీ చోటేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోరికలు ఎక్కువవుతున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో ఏంజరగనుందో వేచి చూడాల్సిందేనని దిగ్విజయ్ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.