Site icon HashtagU Telugu

AP Congress : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. ఏపీలో ఉపయోగపడుతుందా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కామెంట్స్..

AP Congress Chief Gidugu Rudra Raju comments on Karnataka Result

AP Congress Chief Gidugu Rudra Raju comments on Karnataka Result

కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్(Congress) భారీ విజయం దక్కించుకుంది. చాలా రోజుల తర్వాత ఇంత మంచి విజయం కాంగ్రెస్ కి దక్కడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ అగ్ర నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఊసే లేని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు సెలబ్రేషన్స్ చేసుకొని 2024 లో కాంగ్రెస్ దేశమంతటా వస్తుంది అని అంటున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతో కొంత ఈ ప్రభావం ఉండబోతుందని అక్కడి నాయకులు అంటున్నారు. ఏపీలో ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచి హంగామా చేశారు ఏపీ కాంగ్రెస్ నాయకులు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju) మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు. కాంగ్రెస్ పై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. కర్నాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అద్భుతమైన విజయం అందించారు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచీ ఖర్గే ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీతో సహా ఎంతోమంది పెద్దలు టీం‌ వర్క్ చేశారు. అరవై నియోజకవర్గాలలో తెలుగు వారి ప్రభావం ఉంది. అక్కడ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మి గెలిపించారు. గృహ‌జ్యోతి, గృహ లక్ష్మి, అన్నదాత, యువ నిధి, మహిళా శక్తి పధకాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. కాంగ్రెస్ హామీలను అమలు చేస్తుందనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారు. ప్రజల్లో విశ్వసనీయత సంపాదించాం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల్లో, కాంగ్రెస్ లో మంచి‌ జోష్ వచ్చింది. గతంలో కంటే మా‌ పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. ప్రధాని మోడీ స్వయంగా రోడ్ షోలు చేసినా ప్రజలు నమ్మలేదు అని అన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మంచి ఆదరణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయం. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రజలు కూడా ఏపీలో కాంగ్రెస్ విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. కర్నాటక లో గెలిచాం, తెలంగాణలో గెలుస్తున్నాం, ఏపీలో కూడా గెలవబోతున్నాం. ఏపీలో బీజేపీ అనే మూడు పార్టీలను ఓడించి కాంగ్రెస్ ని గెలిపించాలని కోరుతున్నాం. 2024 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ విజయం ఖాయం అని అన్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ గెలుపు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రభావం చూపుతుందో తెలియాలి.

 

Also Read : Sunil Kanugolu : కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించింది ఇతడే.. సునీల్ కనుగోలు.. ఎవరితను?