Jagan Vs Employees : ఉద్యోగులు, జ‌గ‌న్ మ‌ధ్య ప్రచ్ఛ‌న్న‌యుద్ధం.. పీఆర్సీ వ‌ర్సెస్ అవినీతి

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. పీఆర్సీ కోసం ఉద్యోగుల‌కు న‌వంబ‌ర్ ఆఖ‌రి వ‌ర‌కు డెడ్ లైన్ పెట్టారు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 03:31 PM IST

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. పీఆర్సీ కోసం ఉద్యోగుల‌కు న‌వంబ‌ర్ ఆఖ‌రి వ‌ర‌కు డెడ్ లైన్ పెట్టారు. ఆ లోపు తేల్చ‌క‌పోతో తాడోపేడో తేల్చుకుంటామ‌ని హెచ్చ‌రించారు. కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాదిరిగా జ‌గ‌న్ స‌ర్కార్ మెత్త‌బ‌డ‌లేదు. ఎక్క‌డ నొక్కాలో..అక్క‌డ నొక్కాడు జ‌గ‌న్‌. దీంతో ఇప్పుడు ఉద్యోగులు గిల‌గిల‌లాడుతున్నారు. పీఆర్సీకు బ‌దులుగా తాజాగా జ‌గ‌న్ తీసుకున్న అవినీతి నిరోధ‌క డ్రైవ్ వాళ్ల‌కు మింగుడుప‌డ‌డంలేదు. ప్ర‌భుత్వ ఉద్యోగులంట‌నే లంచ‌గొండులు అనే ముద్ర ఎక్కువ మందిపై ఉంది. వాళ్ల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ కుక్క తోక వంక‌ర మాదిరిగా లంచాలు మొక్కుతూనే ఉన్నారు. వాటికి చెక్ పెట్టేలా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : మ‌ర్రికి మొండి చెయ్యి చూపిన జ‌గ‌న్‌..పేట వైసీపీలో ముస‌లం

ఉద్యోగుల అవినీతిపై 14400కి ఫోన్ చేస్తే చాలు వాళ్ల జాబ్ ఊస్టింగ్ చేసేలా జ‌గ‌న్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఏడాదిన్న‌ర క్రితం అవినీతి మీద తొలి యుద్ధం జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. ఆ స‌మ‌యంలో 14400 నెంబ‌ర్ ను ప్ర‌క‌టించాడు. రెవెన్యూ కార్యాల‌యాల‌పై ఒకేరోజు ఏసీబీ దాడుల‌ను నిర్వ‌హించేలా చేశాడు. ఆ త‌రువాత కోవిడ్ రావ‌డంతో డ్రైవ్ అర్థాంత‌రంగా ముగిసింది. ఇప్పుడు మ‌ళ్లీ దానికి మ‌రింత ప‌దునుపెడుతున్నాడు. లంచాలు తీసుకుంటే ఇక ఉద్యోగుల‌ను ఇంటికి పంపించేలా సంచ‌ల‌న నిర్ణ‌యం జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, పౌర సేవల్లో అవినీతిపై ఫిర్యాదులు చేయ‌డానికి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శాఖ 1064 టోల్‌ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేసింది. దీనితో పాటుగా 8333995858 వాట్సాప్‌ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ కూడా ఉంది. దానికితోడు చంద్ర‌బాబు హ‌యాంలో ఏర్పాటు చేసిన 1100 కాల్‌ సెంటర్‌కూ ఫిర్యాదులు వెల్లువ ఆగ‌లేదు. వీటికి అద‌నంగా ఇప్పుడు జ‌గ‌న్ తీసుకొచ్చిన 14400 నెంబ‌ర్ కు ఫోన్ చేసి లంచాల‌పై ఫిర్యాదు చేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఫిర్యాదుదారుని పేరు ర‌హ‌స్యంగా ఉంచడ‌మే కాకుండా ఆ ఫిర్యాదు మీద విచార‌ణ చేసిన త‌రువాత నేరుగా సంబంధిత ఉద్యోగిని ఇంటికి పంపించడం తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యం.

Also Read : షా చాటు జ‌గ‌న్‌.!

ఇప్ప‌టి వ‌ర‌కు రెవిన్యూ లో 5000వేలకు పైగా ఫిర్యాదు ఉన్నాయి. వాటి మీద విచార‌ణ కొన‌సాగుతోంది. ఈసారి క‌ఠిన చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ పూనుకుంటోంది. అవినీతి ప‌రుల భ‌ర‌తం ప‌ట్టేలా జ‌గ‌న్ అడుగులు చాలా క‌ఠినంగా పడుతున్నాయి. ఆ విష‌యం గ్ర‌హించిన ఉద్యోగులు జీతాల గురించి మాట్లాడుతున్నారు. ఒకటో తేదీన జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ‌ని ఏపీ ఎన్జీవో సంఘం చెబుతోంది. ఆస్పత్రి వెళ్లేందుకు హెల్త్ కార్డులు లేవనే అంశాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశమైంది. అంతేకాదు, నవంబర్ నెలాఖరులోపు పీఆర్సీ అమలు కాకపోతే ఈ నెల 27, 28 తేదీల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎన్జీవో అధ్య‌క్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చ‌రిస్తున్నాడుఈ క్రమంలోనే మ‌రో 13 సంఘాల్లో 9 సంఘాల నాయకులను కూడ క‌ట్టుకునేందుకు ఏపీ ఎన్జీవో మాస్ట‌ర్ ప్లాన్ వేస్తోంది.

Also Read : ఏపీలో గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌లు క్లోజ్, 30వేల ఉద్యోగాలు హుష్‌!

పీఆర్సీ అంశంపై ఈ సంఘాలన్నింటినీ ఒకే వేదిక‌పైకి తీసుకురావడానికి సిద్ధం అవుతోంది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా ఉద్యోగుల అవినీతిపై ఈనెల 20వ తేదీ నుoచి పూర్తిస్థాయిలో నిఘా పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్ర‌భుత్వ‌ శాఖల్లో అవినీతి నిరోధకశాఖ అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నాడు. ప్రజలు అందరూ అవినీతిరహిత సమాజం కోసం ముందుకు రావాలని జ‌గ‌న్ స‌ర్కార్ పిలుపు నిచ్చింది.
అవినీతి ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ జరుగుతున్నా.. మీ దృష్టికి వస్తే వెంటనే 14400 నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని ఏపీ ఏసీబీ పిలుపు నిస్తోంది. ఫిర్యాదుదారుల‌ వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని భరోసా ఇస్తోంది. సో..చంద్ర‌బాబు మాదిరిగా జ‌గ‌న్ ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలు తీర్చ‌డానికి సిద్ధంగా లేడు. కేవ‌లం హ‌క్కులే కాదు…బాధ్య‌త‌లను కూడా ఉద్యోగుల‌కు జ‌గ‌న్ గుర్తు చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే `అవినీతి ర‌హిత ఏపీ` స్లోగ‌న్ ను జ‌గ‌న్ అందుకున్నాడు. మ‌రోవైపు పీఆర్సీ నినాదంతో ఉద్యోగులు ముందుకు క‌దులుతున్నారు. ఈ విధంగా అటు ఉద్యోగులు ఇటు సీఎం జ‌గ‌న్ మ‌ధ్య న‌డుస్తోన్న ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ఎండింగ్ ఎలా ఉంటుందో ఆస‌క్తిక‌రం.