YS Jagan : మెడిక‌ల్ కాలేజిలన్నీ మావే! అందుకే ఎన్టీఆర్ పేరు మార్చేశాం: అసెంబ్లీలో జ‌గ‌న్‌

బాగా ఆలోచించిన తర్వాతే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్మోన్ రెడ్డి అసెంబ్లీలో వెల్ల‌డించారు.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 02:08 PM IST

బాగా ఆలోచించిన తర్వాతే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్మోన్ రెడ్డి అసెంబ్లీలో వెల్ల‌డించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆరోగ్య‌శ్రీ వంటి పథకాల సృష్టికర్త ఎవరు అంటే అందరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. టీడీపీ పుట్టుక ముందే (1983 కు ముందు) రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. మరో మూడు కాలేజీలను వైఎస్సార్ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని టీడీపీ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును బలవంతంగా పెట్టుకుందన్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ పేరుకు బ‌దులుగా వైఎస్సార్ పేరును పెడుతున్నామ‌ని వివ‌రించారు జ‌గ‌న్‌.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఏపీ అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని బిల్లును సభ ముందు ఉంచారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను ఏ విధంగా చంద్ర‌బాబునాయుడు ప‌లు సంద‌ర్బాల్లో అవ‌మానించారో పేప‌ర్ క్లిప్పింగ్ లు, వీడియోల ద్వారా వివ‌రించారు. ఆ త‌రువాత పేరు మార్పు నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. టీడీపీ సభ్యులు గొడవ చేయాలనే అసెంబ్లీకి వచ్చారని, అందుకే స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారన్నారు. ఎన్టీఆర్ పేరు పలకడం చంద్రబాబుకు ఇష్టం ఉండదని, తాను ఎప్పుడూ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు అన్నారు. చంద్రబాబు కంటే ఎక్కువ ఎన్టీఆర్ కు గౌరవం ఇస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు.

చంద్రబాబు న్టీఆర్‌కు వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఎక్కువ కాలం సీఎంగా ఉండేవాళ్లు అన్నారు జగన్. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదన్నారు. ఎన్టీఆర్‌ కూతుర్ని గిఫ్ట్‌గా ఇస్తే, చంద్రబాబు వెన్నుపోటు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకుంటారని, ఎంతోమందిని ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని చేశానని చెప్పుకుంటార‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. అలాంటి చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. డాక్ట‌ర్ వైఎస్ఆర్ కుమారుడిగా ఆత్మ‌ప్ర‌బోధానుసారంగా ఎన్టీఆర్ పేరుకు బ‌దులుగా తండ్రి పేరును పెట్టుకుంటున్నాన‌ని చెబుతూ ప్ర‌సంగాన్ని ముగించ‌డం హైలెట్‌.