డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ పై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్.. మ‌త్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసుల‌కు ఆదేశం

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎట్ట‌కేల‌కు డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. కాలేజి యాజ‌మాన్యాలు నిశితంగా విద్యార్థుల క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు

  • Written By:
  • Publish Date - October 5, 2021 / 04:06 PM IST

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎట్ట‌కేల‌కు డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. కాలేజి యాజ‌మాన్యాలు నిశితంగా విద్యార్థుల క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. డ్ర‌గ్స్ ర‌హిత ఏపీగా మార్చడానికి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని ఏపీ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీలు అనుమానిత ప్రాంతాల్లో త‌నిఖీలు విస్తృతంగా చేయాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా కాలేజి, యూనివ‌ర్సిటీల్లోనే డ్ర‌గ్స్ ఉంటాయ‌ని, ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టాల‌ని ఆదేశించాడు జ‌గ‌న్.
ఆప్ఘ‌న్ టూ ఆంధ్ర డ్ర‌గ్స్ లింకుల‌పై ప్ర‌తిప‌క్షంతో పాటు విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశాయి. ఒకానొక సంద‌ర్భంలో తాడేప‌ల్లి ప్యాలెస్ టూ ముంద్ర పోర్ట్ అంటూ టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను గుప్పించింది. ఈ లింకుల‌పై సాయిరెడ్డిని కూడా టీడీపీ వ‌ద‌ల్లేదు. సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆ పార్టీ డిమాండ్ చేసింది. తాలిబ‌న్ల‌తో ఉన్న లింకుల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ప‌లు ర‌కాలుగా డిమాండ్ చేసింది. గుజ‌రాత్ ముంద్రా ఓడ‌రేవుకు, కృష్ణ‌ప‌ట్నం ఓడ‌రేవుకు ఉన్న సంబంధాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ధ‌ర్నాల‌ను కూడా చేసింది. కొన్ని రోజులుగా డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ మీద టీడీపీ పోరాటాలు చేస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాల డిమాండ్ మీద స్పందించాడు. మత్తు ప‌దార్థాలు లేని రాష్ట్రంగా ఏపీ ఉండాల‌ని పోలీసుల్ని ఆదేశించాడు.
విజ‌య‌వాడ అషి ట్రేడ‌ర్ కు 1.75లక్ష‌ల కోట్ల విలువైన హెరాయిన్, గంజాయి త‌దిత‌ర మ‌త్తు ప‌దార్థాలు దిగుమ‌తి అయ్యాయ‌ని టీడీపీ లీడ‌ర్ వ‌ర్ల రామ‌య్య ఆరోపించాడు. ఇటీవ‌ల 3 ట‌న్నుల డ్ర‌గ్స్ ను ముంద్ర పోర్ట్ వ‌ద్ద ప‌ట్టుకున్న త‌రువాత విజ‌య‌వాడ లింకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. సుమారు 21వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను సీజ్ చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ద‌ర్యాప్తు సంస్థ‌లు సేక‌రించిన స‌మాచారం మేర‌కు కొన్నేళ్లుగా గుజ‌రాత్ ముంద్ర ఓడ‌రేవు నుంచి కృష్ణ‌ప‌ట్నం ఓడ‌రేవుకు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అవున్న‌ట్టు అనుమానించారు. కృష్ణ‌పట్నం ఓడ‌రేవు నుంచి విజ‌య‌వాడ అషి ట్రేడింగ్ కంపెనీకి స‌ర‌ఫ‌రా అవుతున్న‌ట్టు ప్రాథ‌మికంగా ద‌ర్యాప్తు అధికారులు అనుమానించారు. మంద్రా ఓడ‌రేవు వ‌ద్ద సీజ్ చేసిన డ్ర‌గ్స్ కు దిగుమ‌తి చిరునామా విజ‌య‌వాడ‌లోని అషి ట్రేడ‌ర్స్ గా ఉంది.
గంజాయి, హెరాయిన్ ప‌లు చోట్ల ఏపీలో త‌నిఖీల సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. వాటిని ఎవ‌రు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు? ఎక్క‌డికి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు? వాటిని ఎవ‌రు వాడుతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఏపీ పోలీసుల్ని వేధిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోనూ గుట్కా, గంజాయి, హెరాయిన్ వంటి మ‌త్తు ప‌దార్థాల‌ను కొంద‌రు స‌ర‌ఫరా చేస్తున్నారు. గ్రామాల్లోని యువ‌కులు బృందాలుగా ఏర్ప‌డి వీటిని స‌ర‌ఫరా చేస్తున్న‌ట్టు నిఘా వ‌ర్గాలకు అందిన స‌మాచారం. అందుకే సీఎం జ‌గ‌న్ ఈ మొత్తం వ్య‌వ‌హారం మీద సీరియ‌స్ అయ్యాడు. భ‌విష్య‌త్ లో ఇలాంటి నేరాలు జ‌ర‌గ‌డానికి వీల్లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏపీ పోలీసులు ఈ దందాల‌ను ఎలా అరిక‌ట్ట‌గ‌ల‌రో చూద్దాం.