Kethireddy : జ‌గ‌న్ వ‌ద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి భాగోతం?

అంద‌రికీ భిన్నంగా ఉండాల‌ని కోరుకోవ‌డం చాణ‌క్యుడు చెప్పిన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్లో ఒక‌టి.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 01:43 PM IST

అంద‌రికీ భిన్నంగా ఉండాల‌ని కోరుకోవ‌డం చాణ‌క్యుడు చెప్పిన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్లో ఒక‌టి. దాన్ని ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి అందిపుచ్చుకున్నారు. ప్ర‌తి రోజూ `గుడ్ మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం` పేరు ప్ర‌జ‌ల్ని కలుస్తున్నారు. స‌రిగ్గా ఆయ‌న వాల‌కాన్ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రోక్షంగా బుధ‌వారం జ‌రిగిన మీటింగ్ లో ప్ర‌స్తావించారు. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లి ప్ర‌జ‌ల్ని క‌లవ‌డం కాదంటూ ఆయ‌న‌ వ్యాఖ్య‌నించ‌డం కేతిరెడ్డికి తగిలింది.

వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చిన 27 మంది ఎమ్మెల్యేల జాబితాలో కేతిరెడ్డి కూడా ఉన్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఎందుకంటే, ఆయ‌న మీద ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ధ‌ర్మవ‌రం చెరువును ఆనుకుని 100 ఎక‌రాల్లో ఫౌంహౌస్ ను నిర్మించుకున్నారు. ఆ భూముల్లో క‌నీసం 20 ఎక‌రాలు ధ‌ర్మ‌వ‌రం చెరువు భూములు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. సుమారు 2వేల సాగుకోసం ఉప‌యోగ‌ప‌డే ధ‌ర్మ‌వ‌రం చెరువును ఆక్ర‌మించిన తీవ్ర ఆరోప‌ణ ఆయన మీద ఉంది. ఫౌంహౌస్ చుట్టూ ప్రైవేటు సైన్యాన్ని మోహ‌రించి ఉంటార‌ట‌. వేట కుక్క‌లు, గుర్ర‌పు స్వారీల‌తో ఆయ‌న తుల‌తూగుతున్నార‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ కు అందిన స‌మాచారంగా చెప్పుకుంటున్నారు. అందుకే, ఆయన వాల‌కం మీద నిఘా వ‌ర్గాల‌తో స‌మాచారం సేక‌రించిన జ‌గ‌న్ బుధ‌వారం రోజు ప‌రోక్షంగా చుర‌క‌లు వేశారని తెలుస్తోంది.

ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేయించే క్ర‌మంలో అక్క‌డి క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడుతో ఆయ‌న‌కు వివాదం ఏర్ప‌డింది. దీంతో క‌లెక్ట‌ర్ ను అక్క‌డి నుంచి బ‌దిలీ చేయించారు. ఆ రోజు నుంచి మిగిలిన అధికారులు కేతిరెడ్డికి దాదాపుగా దాసోహం అయ్యారు. అంతేకాదు, అవినీతికి పాల్ప‌డిన వ‌లంటీర్లు తిరిగి ల‌బ్దిదారుల‌కు డ‌బ్బులు వాప‌స్ చేయాల‌ని హుకుం జారీ చేశారు. ఒక వేళ అలా చేయ‌క‌పోతే చెప్పుతో కొడ‌తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విషయం విదిత‌మే. ప్ర‌తి రోజూ గుడ్ మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం పేరుతో ఆయ‌న చేస్తోన్న ప‌ర్య‌ట‌న క‌వ‌రేజ్ కోసం బెంగుళూరు నుంచి స్పెష‌ల్ టీమ్ ఉంది. ఆ టీమ్ కు ప్ర‌త్యేక వ‌స‌తి, అట్రాక్టివ్ శాల‌రీస్ ఇస్తూ ఫోక‌స్ అవుతున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న వెనుక లాజిక్ ను గ‌మ‌నిస్తే, ఆయ‌న వద్ద‌కు వ‌చ్చే ఫిర్యాదుల ఆధారంగా స్థానికంగా ఉండే అధికారుల‌ను బ్లాక్ మెయిల్ చేస్తార‌ని కేతిరెడ్డి మీద టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. ఇప్ప‌టికే అసైన్డ్ భూముల‌ను బినామీ పేర్ల‌తో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ర్వే నెంబ‌ర్ 902, 908 వర‌కు 20 కొత్త నెంబ‌ర్ల‌ను సృష్టించ‌డం ద్వారా సుమారు 25 ఎక‌రాల అసైన్డ్ భూముల‌ను సొంతం చేసుకున్నార‌ని టీడీపీ బాహాటంగా ఆరోపిస్తోంది. ఆక్ర‌మించిన భూముల్లోని 10 ఎక‌రాల విస్తీర్ణంలో విలాస‌వంత‌మైన భ‌వ‌నం క‌ట్టారని స్థానిక టీడీపీ లీడ‌ర్లు చెబుతున్నారు. అదే విష‌యాన్ని ఆ పార్టీ ప‌త్రిక చైత‌న్య‌ర‌థంతో ప్ర‌చురించారు.

2019 ఎన్నిక‌ల అఫిడ‌విట్ ఆధారంగా కేతిరెడ్డి ఆస్తుల విలువ రూ. 5కోట్లు. కానీ, ఇప్పుడు ఆ ఆస్తులు 500 కోట్ల వ‌ర‌కు పెరిగాయ‌ని స్థానికుల అంచ‌నా. కేవ‌లం విలాస‌వంత‌మైన కార్లను రూ 10కోట్ల‌తో కొనుగోలు చేశాడ‌ని చెప్పుకుంటారు. అంతేకాదు, ఒక్కో గుర్రం రూ 20ల‌క్ష‌ల చొప్పున 10 గుర్రాల‌ను కొనుగోలు చేసి, కేతిరెడ్డి స్వారీ చేస్తున్నార‌ని ఆయ‌న గురించి చెప్పుకోవ‌డం స‌హ‌జంగా మారింది. నియెజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేస్తోన్న ఆక్ర‌మాల గురించి గ‌వ‌ర్న‌ర్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. అంతేకాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల‌కు కూడా ఆయ‌న దందాల‌ను తీసుకెళ్లింది. ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బెస్ట్ ఎమ్మెల్యేగా ఫోక‌స్ అవుతోన్న కేతిరెడ్డి రెండో కోణం బ‌య‌ట‌కు వ‌స్తోంది.