AP Politics : చంద్ర‌బాబు త‌ర‌హాలో జ‌గ‌న్

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా చేస్తున్నారా? అంటే ఔను అనే వాళ్లు ఎక్కువ‌గా తార‌స‌ప‌డుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 12:55 PM IST

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా చేస్తున్నారా? అంటే ఔను అనే వాళ్లు ఎక్కువ‌గా తార‌స‌ప‌డుతున్నారు. ఎందుకంటే, మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఎంత ధీమాతో ఉన్నారో, అదే ధీమా ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలోనూ క‌నిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి , రాజ‌ధాని అంశం రాష్ట్రంలోని 80శాతం ఓట‌ర్లు అనుకూలంగా ఉన్నార‌ని ఆనాడు చంద్ర‌బాబు భ్ర‌మ‌ప‌డ్డారు. అంత‌కు మించిన భ్ర‌మ‌ల్లో ఉంటోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 175 స్థానాల్లోనూ ఎందుకు గెల‌వ‌కూడ‌దంటూ ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు, కో ఆర్డినేట‌ర్లు, ఇంచార్జిల‌కు క్లాస్ పీకుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాలు భిన్నంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

గెలుపు మీద ధీమాతో నీరు-చెట్టు ప్రోగ్రామ్ కింద ప‌లు ప‌నుల‌ను ఆనాడు టీడీపీ క్యాడ‌ర్ ద్వారా చంద్ర‌బాబు హడావుడిగా చేయించారు. ఆయ‌న మీద న‌మ్మ‌కంతో వేలాది మంది ఆ పార్టీ క్యాడ‌ర్ కాంట్రాక్ట‌ర్లుగా మారిపోయారు. అప్పులు చేసి కొంద‌రు, ఇళ్ల‌లోని బంగారాన్ని తాక‌ట్టు పెట్టి మ‌రికొంద‌రు అభివృద్ధి ప‌నులు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నిధులు విడుద‌ల చేస్తార‌ని విశ్వసించారు. సీన్ క‌ట్ చేస్తే, పసుపు-కుంకుమ కింద సుమారు రూ. 20వేల కోట్ల వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు పంచారు. కొంద‌రికి పోస్ట్ డేటెడ్ చెక్కులు పంపిణీ చేశారు. ఫ‌లితంగా గ్రామ‌, మండ‌ల స్థాయిలోని లీడ‌ర్లు కం కాంట్రాక్ట‌ర్లు రోడ్డున ప‌డ్డారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో పోలింగ్ కేంద్రాల వ‌ద్ద నిల‌బ‌డే వాళ్లే లేకుండా పోయారు. దీంతో 23 మంది ఎమ్మెల్యేల‌కు టీడీపీ ప‌రిమితం అయింది.

ప్ర‌స్తుతం వైసీపీలోని ప‌రిస్థితి కూడా ఆనాడు టీడీపీ క్యాడ‌ర్ త‌ర‌హాలోనే ఉంది. మూడేళ్లుగా కాంట్రాక్టులు చేసిన లీడ‌ర్లు కం కాంట్రాక్ట‌ర్లు అప్పులు పాల‌య్యారు. ప్ర‌భుత్వం కాంట్రాక్టు బిల్లుల‌ను క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట‌ల‌ను న‌మ్ముకుని కాంట్రాక్టులు చేసి చాలా మంది వైసీపీ ద్వితీయ‌శ్రేణి లీడ‌ర్లు రోడ్డున ప‌డ్డారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ కార‌ణంగా ప్ర‌జ‌ల‌తో ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వైసీపీ కొత్త విధానాల వల్ల క్యాండర్ ఆశలు అన్నీ కొట్టుకుపోయాయి. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారికి తీరని అన్యాయం జరిగింది. పదేళ్ల పాటు భుజాల మీద మోసి అన్నీ అరగదీసుకున్న క్యాడర్ వైసీపీకి దూర‌మ‌వుతూ వ‌స్తోంది.

ముచ్చటగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ నాలుగవ ఏట అడుగుపెట్టింది. అయితే ఈ మూడేళ్ళలో క్యాడర్ చేదుని మింగుతూ పడుతూ లేస్తూ అలా సాగుతోంది. ఎప్పటికైనా తమకు ముక్తీ మోక్షం ఉంటాయన్న ఆశతోనే సాగుతోంది. కానీ వారు ఊహించినది ఏమీ జరగడంలేదు. కనీసం వారికి వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు కీలక నేతల నుంచి కూడా దగ్గరకు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు.ఈ పరిణామంతో ఒక్కసారిగా క్యాడర్ స్తబ్దుగా మారిపోయింది. ఇలాంటి ప‌రిస్థితి 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో ఉంది. ఇప్పుడు వైసీపీలో క‌నిపిస్తోంది. అంటే, 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో చంద్ర‌బాబు త‌ర‌హాలో మిగులుతార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

`ఒక్కసారి అవ‌కాశం ఇస్తే మ‌రో 30ఏళ్లు సీఎంగా ఉండేలా పాల‌న అందిస్తా. 2029 వ‌ర‌కు మ‌రో పార్టీకి అవ‌కాశం ఉండ‌దు.` ఇదీ ఒక‌ప్పుడు వైసీపీ చీఫ్ చెప్పిన మాట‌లు. కానీ, ఇప్పుడు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయ‌ని బుధ‌వారం సిట్టింగ్ ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన ఫైన‌ల్ వార్నింగ్ ఆధారంగా స్ప‌ష్టం అవుతోంది.