జ‌గ‌న్ ముందు కేసీఆర్ దిగ‌దుడుపే! ఏపీలో లండ‌న్ త‌ర‌హా విద్య‌, వైద్యం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త‌ల‌తో పాటు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ ప్ర‌‌భుత్వాలు చేయ‌లేని సాహ‌సాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్ చేశాడు. కెన‌డా త‌ర‌హా విద్య‌ను అందిస్తాన‌ని ఎన్నిక‌ల హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంగ్లీషు మీడియం ను ప్రాథ‌మిక స్థాయిలో ప్ర‌వేశ‌పెట్ట‌లేక పోయాడు.

  • Written By:
  • Publish Date - October 26, 2021 / 01:15 PM IST

అభివృద్ధిలో ముందున్న మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో సైతం ధ‌నికులు మాత్ర‌మే ఇంగ్లీషు మీడియంలో వాళ్ల పిల్లల్ని చ‌ద‌విస్తున్నారు. మిగిలిన ద‌ళిత‌, ఆదివాసీ, శూద్ర జాతుల పిల్ల‌లు ఇప్ప‌టికీ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాష‌ల‌కు ప‌రిమితం అవుతున్నారు. విద్య అన్ని వ‌ర్గాల‌కు స‌మానంగా అంద‌కపోవంతో ‌అస‌మానత‌లు, ఆర్థికస్థితి గ‌తుల మ‌ధ్య అంత‌రం పెరిగిపోతోంది. ఈ ప‌రిణామం వివ‌క్ష‌కు దారితీస్తుంద‌ని జ‌గ‌న్ నిశ్చితాభిప్రాయం.

విద్య‌, వైద్యం ప్ర‌తి పౌరుడి ప్రాథ‌మిక హ‌క్కు కావాల‌ని కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్, క‌ర్నాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య త‌ర‌హాలో ఇంగ్లీషు మీడియం ప్రాథ‌మిక ద‌శ నుంచి అందరికీ అందించాల‌ని జ‌‌గ‌న్‌ భావించాడు. విద్య‌, వైద్యం ఉచితంగా అందించ‌గ‌లిగితే..చాలా వ‌ర‌కు అంట‌రానిత‌నం స‌మ‌సి పోతుంద‌ని రాజ్యాంగ రూప‌క‌ర్త అంబేద్క‌ర్ ఏనాడో చెప్పిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ దిశ‌గా స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏ ప్ర‌భుత్వమూ పూర్తి స్థాయిలో ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్య‌, వైద్యం మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. గ‌త ప్ర‌భుత్వాల కంటే బ‌డ్జెట్ కేటాయింపుల‌ను పెంచారు. ధ‌నిక‌, పేద అంత‌రం లేకుండా అంద‌రికీ స‌మానంగా విద్య‌, వైద్యాన్ని అందించే ప్ర‌య‌త్నానికి జ‌గ‌న్ బీజం వేశాడు.

విద్యా రంగం చ‌రిత్ర‌లో ఇంగ్లీషు మీడియం కేవ‌లం ఉన్న‌త వ‌ర్గాల‌కు మాత్ర‌మే పరిమితం అన్న‌ట్టు ఇటీవ‌ల‌దాకా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం కార‌ణంగా అంగ‌న్వాడీ నుంచి పీజీ వ‌ర‌కు అంద‌రికీ ఇంగ్లీషు అందుబాటులోకి వ‌చ్చింది. నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా పాఠ‌శాల‌లు, కాలేజిల రూపులేఖ‌ల్ని ఏపీ ప్ర‌భుత్వం మార్చేసింది. నాణ్య‌మైన విద్య‌ను అంద‌రికీ స‌మానంగా అందించాల‌ని జ‌గ‌న్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం బ‌డ్జెట్ లో అమ్మ ఒడి ప‌థ‌కం కింద తొలి ఏడాది 13వేల 22కోట్లను 44ల‌క్ష‌ల 48వేలా 865 మంది త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేశారు. కాలేజి స్థాయి విద్యార్థుల కోసం 5వేల 573 కోట్ల‌ను 18ల‌క్ష‌ల 80వేల 934 కుటుంబాల ఖాతాల‌కు జ‌మ చేయ‌డం జ‌రిగింది. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కింద 2వేల 270 కోట్ల‌ను 15లక్ష‌ల 56వేల 956 కుటుంబాల‌కు అందించారు. జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం కింద 1600కోట్లు మ‌ధ్యాహ్నం భోజ‌నం కోసం ఖర్చు అయింది. పుస్త‌కాలు, బ్యాగులు, బూట్లు త‌దిత‌రాల కోసం జ‌గ‌న‌న్న కానుక ప‌థ‌కం ద్వారా 650కోట్ల ఖ‌ర్చు పెట్టారు. పాఠ‌శాల‌ల్లో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న కోసం 26వేల 678 కోట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది.

లండ‌న్ త‌ర‌హా విద్య‌, వైద్యం అందించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను తీసుకురావ‌డానికి జ‌గ‌న్ బీజం వేశాడు. ఇన్ఫోసిస్ నారాయ‌ణమూర్తి ఇటీవ‌ల వ్యాఖ్యానించిన విధంగా ఇంగ్లీషును జాతీయ భాష‌గా గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఏపీ సీఎం భావిస్తున్నాడు. జాతీయ‌తాభావం పెర‌గ‌డానికి దేశ వ్యాప్తంగా ఓకే భాష అవ‌స‌ర‌మ‌ని మేధావుల అభిప్రాయం. ఆ క్ర‌మంలోనే బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి ఇచ్చే జీతాల కంటే మౌలిక స‌దుపాయాల‌కు ఎక్కువ‌గా ఏపీ ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్టింది.వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకురావ‌డానికి జ‌గ‌న్ లండ‌న్ త‌ర‌హా విధానం తీసుకున్నారు. దాన్ని అమ‌లు చేయ‌డంలో భాగంగా వేల సంఖ్య‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయడానికి స‌న్న‌ద్ధం అయ్యారు. ప్ర‌తి జిల్లా కేంద్రంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి, మెడిక‌ల్ కాలేజి ఉండేలా ప్లాన్ చేశారు. గ్రామ స్థాయి నుంచి పౌరుల ఆరోగ్య రికార్డును కంప్యూట‌రైజ్ చేసి భ‌ద్ర‌ప‌రిచే వినూత్న విధానం అమ‌లు చేయ‌డానికి జ‌గ‌న్ నిర్ణ‌యించాడు. ఈ రెండు రంగాల‌ను స‌మూలంగా మార్చేసి, ఉచితంగా అందించ‌గ‌లిగితే ఆర్థిక అస‌మాన‌త‌లు, వివ‌క్ష త‌దిత‌రాలు త‌గ్గిపోవ‌డ‌మే కాకుండా సామాజిక మార్పులు పెద్ద ఎత్తున వ‌స్తాయ‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నాడు. అందుకే ఆ రెండు రంగాల‌కు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించ‌ని విధంగా నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం స‌మ‌కూర్చింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల సీఎంల‌కు జ‌గ‌న్ రోల్ మోడ‌ల్ అవుతాడ‌ని ఆయా రంగాల్లోని నిపుణుల అభిప్రాయం.