YS Jagan : ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ద‌డ

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (Out-Sourcing Employees) విష‌యంలో జగన్ మోహన్ రెడ్డి స‌ర్కార్ వెనుక్కు త‌గ్గింది.

  • Written By:
  • Updated On - December 5, 2022 / 05:11 PM IST

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (Out-Sourcing Employees) విష‌యంలో జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) స‌ర్కార్ వెనుక్కు త‌గ్గింది. వాళ్ల‌ను తొల‌గిస్తూ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను వెన‌క్క తీసుకుంది. వాటిపై సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు మ‌సిపూసి మారేడుకాయ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుమారు 2.50ల‌క్ష‌ల మంది పొరుగు సేవ‌ల ఉద్యోగుల నుంచి పెల్లుబికిన అస‌హ‌నం ప్ర‌భుత్వాన్ని క‌దిలించింది. తొల‌గింపు ఉత్త‌ర్వుల వెనుక ఏం జ‌రిగింద‌నే దానిపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం జ‌గ‌న్ స‌ర్కార్ (AP Government ) చేస్తోంది. ఆ ఉత్త‌ర్వులు కేవ‌లం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ శాఖలో పదేళ్ల లోపు పనిచేసే పోరుగుసేవల ఉద్యోగులకు మాత్రమేనని ప్ర‌భుత్వం చెబుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చామని, మిగిలిన శాఖ‌ల్లో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగుల‌కు ఆ ఉత్తర్వులతో వ‌ర్తించ‌వ‌ని స్ప‌ష్టం చేస్తోంది.

ప్ర‌భుత్వం విర‌ణ ఇస్తున్న‌ప్ప‌టికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళ‌న శాశ్వ‌తంగా స‌ర్దుమ‌ణ‌గ‌లేదు. దానిపై ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. అస‌లేం జ‌రిగింద‌నే అంశంపై స్ప‌ష్ట‌త‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేస్తాన‌ని జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా ఆయ‌న స‌ర్కార్ అడుగులు వేయ‌డం వాళ్ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. పొరుగు సేవ‌ల ఉద్యోగుల‌ను తొలిగిస్తూ డిసెంబర్‌ 1న ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటేసింది. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వాళ్ల‌కు ఈ ఉత్త‌ర్వుల‌ను వ‌ర్తింప చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో (Gurukul Hostels) పనిచేస్తున్న దాదాపు 350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ ఆదేశాలను ప్ర‌భుత్వం జారీ చేసింది. దీంతో మిగతా విభాగాల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళ‌న బ‌య‌లు దేరింది.

రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండ‌గా లక్ష మందిని ఆప్కాస్ విభాగంలోకి తీసుకురావ‌డం జ‌రిగింది. మిగతా 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్ పార్టీల ద్వారా సేవలు అందిస్తున్నారు. వాళ్ల‌లో పదేళ్లలోపు సర్వీసులో ఉన్నవారు 60 వేల మంది ఉంటార‌ని అంచ‌నా. ఆప్కాస్‌లో చేరిన ప‌రిధిలోని 17 మందిపై ప్రభుత్వం వేటేసింది. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ను హెచ్చ‌రించారు. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంద‌ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని వివ‌ర‌ణ ఇచ్చారు.

పంచాయతీరాజ్ విభాగంలో (AP Panchayati Raj) కొందరు ఉద్యోగుల తొలగింపునకు అధికారులు ఆదేశాలు ఇవ్వగా, సీఎం జగన్ (YS Jagan) మండిపడ్డారని సజ్జల వెల్లడించారు. ఆ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారని వివరణ ఇచ్చారు. పంచాయతీ రాజ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. మొత్తం మీద తాత్కాలికంగా స‌జ్జ‌ల వివ‌ర‌ణ ఉప‌శ‌మ‌నంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ఏదో ప్ర‌భుత్వంలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతుంద‌ని పొరుగు సేవ‌ల ఉద్యోగుల సందేహం. అందుకే, ఉద్యోగ, టీచ‌ర్ల సంఘాల నేత‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి సిద్ధం కావాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు కేవ‌లం పంచాయ‌తీ రాజ్ శాఖ ప‌రిధిలోని వాళ్ల‌ను మాత్ర‌మే తొల‌గిస్తూ ప్ర‌భుత్వం నిమ్మ‌కుంటుందా? రాబోవు రోజుల్లో మ‌రింత మందిని తొలిగిస్తారా? అనేది చూడాలి.

Also Read:  CM KCR : కేసీఆర్ మాయ‌! జై భార‌త్, జై తెలంగాణ క‌నిక‌ట్టు!