Ys Jagan : విప‌క్షాల‌ కూట‌మిపై మూడోక‌న్ను

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను అస్త్రంగా చేసుకుని టీడీపీ-2024 ప్ర‌ణాళిక‌ను ఛిన్నాభిన్నం చేయ‌డానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి గండికొట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ కూట‌మిలోని బీజేపీకి ప్ర‌స్తుతం జ‌గ‌న్ అవ‌స‌రం ఉంది.

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 01:07 PM IST

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను అస్త్రంగా చేసుకుని టీడీపీ-2024 ప్ర‌ణాళిక‌ను ఛిన్నాభిన్నం చేయ‌డానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి గండికొట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ కూట‌మిలోని బీజేపీకి ప్ర‌స్తుతం జ‌గ‌న్ అవ‌స‌రం ఉంది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ధ‌తు లేకుండా బీజేపీ అభ్య‌ర్థి గెల‌వ‌డం క‌ష్టం. ఆయ‌న కాదంటే, ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించ‌డం బీజేపీకి క‌ష్టంగా ఉంది. అందుకే, జ‌గ‌న్ ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్యర్థికి మ‌ద్ధ‌తు ఇచ్చే ప్ర‌తిపాద‌న‌పై చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఒక వేళ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి వైసీపీ మ‌ద్ధ‌తు ఇస్తే 2024 ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయ ఈక్వేష‌న్లు స‌మూలంగా మారే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా ప‌వ‌న్ చెప్పిన ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఐక్య‌త అసాధ్యం.రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంతో దూరం అయ్యేందుకు జగన్ సిద్దంగా లేరనేది పార్టీ ముఖ్య నేతల వాదన. కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సహకారం లభిస్తుందనే ఆశాభావం సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో జ‌గ‌న్‌ మద్దతు ఇవ్వటానికి సిద్దంగా లేకుంటే పరిణామాల‌ను సద్వినియోగం చేసుకోవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య‌ తక్కువగా ఉన్న‌ప్ప‌టికీ చంద్రబాబు మద్దతు ఎవరి వైపు ఉంటుందనేది మరో ఆసక్తి కర అంశం. ఒక వేళ‌ జగన్ దూరంగా ఉంటే, నవీన్ పట్నాయక్ మద్దతును బీజేపీ తీసుకునే అవకాశాలు లేక‌పోలేదు. జగన్ 2024 వ్యూహాల్లో భాగంగా టీడీపీని ఫిక్స్ చేయాలంటే, ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు జ‌గ‌న్ అనివార్యంగా ఇస్తార‌ని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

2017 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎలక్టోరల్‌ కాలేజీలో 65.65% ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల ఉమ్మ‌డి అభ్యర్థి మీరా కుమార్‌ 34.35% ఓట్లకు పరిమితమయ్యారు. కానీ ఈసారి ఈక్వేష‌న్ భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కొన్ని మిత్రపక్షాలు దూరం అయ్యాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయే ఓట్ల విలువ 48.9%గా ఉండగా, విపక్షాల మొత్తం బలం 51.1% గా ఉంది. అందుకే, జూలైలో జ‌రిగే రాష్ట్రపతి ఎన్నికల స‌మీక‌ర‌ణాల‌పై ఇప్ప‌టి నుంచే చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌లోపు 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. వాటి ఫలితాలు ఎలక్టోరల్‌ కాలేజీలో బలాబలాలపై ప్రభావం చూపుతాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఎన్నిక కానున్నారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, తమిళనాడుల్లో కాంగ్రెస్ తో కూడిన కూట‌మి పార్టీలు అధికారం లో ఉన్నాయి.ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి బలం పెరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల మద్దతు ఈసారి ఎన్నిక‌ల్లో కీల‌కం. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తో చర్చలు చేసారని చెబుతున్నారు.

2017 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు బేషరతుగా జగన్ , కేసీఆర్ మ‌ద్ధ‌తు ఇచ్చారు.ఈ సారి ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 2017 లో జగన్ ప్రతిపక్షంలో ఉండటంతో టీడీపీని దెబ్బ తీసేందుకు ఎన్డీఏ అభ్యర్దికి మద్దతిచ్చారు. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ కు ఏపీలో పాలనా పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటికి కేంద్రం స‌హ‌కారం అవ‌స‌రం కాబ‌ట్టి ఈసారి కూడా మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. రాజకీయంగానూ కొన్ని అంశల పైన జ‌గ‌న్ స్పష్టత కోరుతున్నారు. వాటి పైన సానుకూలత వస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో జ‌గ‌న్‌ మద్దతివ్వటానికి సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయేకు మరో 11,990 పాయింట్లు అవసరం. గతంలో మద్దతిచ్చిన తటస్థ పార్టీల్లో ఇప్పుడు టీఆర్ఎస్ దూరమైంది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఇక ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశాలు లేవు. అందుకే, జగన్ -నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని వైసీపీ – బిజూ జనతాదళ్ రెండు పార్టీల వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు. ఆ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చినా ఎన్డీఏ అభ్యర్ధి రాష్ట్రపతి అవుతారు. ఆ రెండు పార్టీలు ఎన్డీఏతో కలవకపోయినా అవసరమైన సమయంలో మద్దతు ఇస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల గురించి బీజేపీ అధినాయకత్వం జగన్ తోనే చర్చలు చేసిందని సమాచారం. అయితే, 2024 ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్న జ‌గ‌న్ ఈసారి ఎన్టీయే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఇబ్బందిక‌ర‌మే. కానీ, రాష్ట్రంలోని విప‌క్షాల కూట‌మి ప్ర‌య‌త్నాల‌ను ఛిన్నాభిన్నం చేయడానికి బీజేపీకి జ‌గ‌న్ జై కొట్టాల్సిందే.!