Vizainagaram : నా రాజ్యం-నా పేర్లు-నా ఇష్టం!

ఒక‌ప్పుడు అమ‌రులైన మ‌హ‌నీయుల స్పూర్తిని స్మ‌రించుకోవ‌డానికి ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు, ప‌థ‌కాల‌కు నామ‌క‌ర‌ణం చేసే ఆన‌వాయితీ ఉండేది. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత మ‌హ‌నీయుల త్యాగాల‌కు సంకేతంగా ప్ర‌ముఖుల పేర్ల‌ను కొన్ని సంస్థ‌ల‌కు కాంగ్రెస్ పెట్టింది.

  • Written By:
  • Updated On - October 8, 2022 / 12:13 PM IST

ఒక‌ప్పుడు అమ‌రులైన మ‌హ‌నీయుల స్పూర్తిని స్మ‌రించుకోవ‌డానికి ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు, ప‌థ‌కాల‌కు నామ‌క‌ర‌ణం చేసే ఆన‌వాయితీ ఉండేది. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత మ‌హ‌నీయుల త్యాగాల‌కు సంకేతంగా ప్ర‌ముఖుల పేర్ల‌ను కొన్ని సంస్థ‌ల‌కు కాంగ్రెస్ పెట్టింది. బ‌తికుండ‌గానే కుటుంబీకుల‌ పేర్ల‌ను వివిధ ప‌థకాల‌కు పెట్టుకునే దుస్థితికి పాల‌కులు ఇప్పుడు వ‌చ్చేశారు. ఆ పోక‌డ ఇటీవ‌ల ఏపీ రాష్ట్రంలో విప‌రీత చ‌ర్య‌ల‌కు దారితీస్తోంది.

అసెంబ్లీ సాక్షిగా హెల్త్ యూనివ‌ర్సిటీకి డాక్ట‌ర్ ఎన్టీఆర్ పేరుకు బ‌దులుగా డాక్ట‌ర్ వైఎస్సాఆర్ పేరును త‌గిలించారు. ఆ నిర్ణ‌యంపై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శిస్తూ వారం పాటు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేసింది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తిరిగి ఎన్టీఆర్ పేరును పెడ‌తామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. దీంతో ఆ ఇష్యూ స‌ద్దుమ‌ణిగింది. మ‌ళ్లీ అలాంటి ఇష్యూనే విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా తెర‌మీద‌కు వ‌చ్చింది.

విజ‌య‌న‌గ‌రంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి చాలా కాలంగా `మ‌హారాజా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి` అనే పేరు ఉండేది. పూర్వం రాజులు ఇచ్చిన భారీ విరాళాల‌కు చిహ్నంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి మ‌హారాజా పేరును పెట్టారు. గురువారం రాత్రి ఆక‌స్మాత్తుగా ఆస్ప‌త్రి పేరును `ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్పత్రి` గా మార్చేశారు. దీంతో మహారాజా కుటుంబీకుల‌తో పాటు టీడీపీ నిర‌స‌న‌ల‌కు దిగింది. విజ‌య‌న‌గ‌రం రాజ‌రికానికి సింబ‌ల్ గా ఆ పేరు ఉండేది. మాజీ ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు వంశ‌స్తులను గుర్తు చేస్తూ ఆ పేరు ఉంద‌ని వైసీపీ భావ‌న‌. అందుకే, మ‌హారాజా పేరును తొల‌గిస్తూ బోర్డును మార్చేశారు.

శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లిన రోగులు, స్థానికులు దీనిపై ఆందోళనకు దిగారు. రాత్రి రాత్రే ఆస్పత్రి పేరు మార్చడం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విప‌రీత చ‌ర్య‌ల‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోందని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ విష‌యంలోనూ రాత్రి వేళ వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని మంత్రుల‌తో నిర్వ‌హించి హ‌డావుడిగా ఆమోదించారు. మరుస‌టి రోజు అసెంబ్లీలో బిల్లును పెడుతూ వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చేశారు.

ప్ర‌జాధ‌నంతో అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు కుటుంబ స‌భ్యులు, సొంత పేర్లు పెట్టుకోవ‌డం ఎక్కువ అయింది. బ‌తికుండ‌గానే పేర్లు పెట్టుకుని సొంత డ‌బ్బా కొట్టుకునే స్థాయికి ప్ర‌స్తుతం రాజ‌కీయం దిగ‌జారింది. ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత చంద్ర‌బాబు 2014 నుంచి ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆయ‌న పేరును పెట్టుకున్నారు. కొన్నింటికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న పేరును, వైఎస్సార్ పేరును ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు పెట్టుకుంటున్నారు. పూర్వం నుంచి వ‌స్తోన్న పేర్ల‌ను మార్చేస్తూ కుటుంబ స‌భ్యుల పేర్ల‌ను త‌గిలించుకోవ‌డాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రోత్స‌హించారు. రాబోవు రోజుల్లో ఇలాంటి ప‌ద్ధ‌తి మ‌రింత ఎక్కువ కానుంది. ప్ర‌జా ధ‌నం దుర్వినియోగం చేస్తూ ఇలా చేయడాన్ని ఆపేవాళ్లు ఏరి? నా ప్ర‌భుత్వం నా ఇష్టం అనేలా వ్య‌వ‌హ‌రించ‌డం రాజ్యాంగాన్ని, నైతిక‌త‌ను ప్ర‌శ్నించ‌డ‌మే అవుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.