Site icon HashtagU Telugu

YS Jagan: 27న ముఖ్యనేతలతో జగన్ భేటీ!

AP Cabinet

Ap Cabinet Ministers 2022

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో వైసీపీ అధిష్టానానికి దిమ్మతిరుగుతోంది. మంత్రి పదవులను కోల్పోయినవారు.. ఆ పదవులను ఆశించి రాకపోవడంతో నిరాశపడ్డవారు.. పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన చెందుతున్నవారు. ఇలా అంతా ఒక్కో రకంగా నిరసన తెలుపుతున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ కు తలనొప్పి తప్పడం లేదు. అందుకే ఎన్నికల వరకు ఎవరినీ ఖాళీగా ఉంచకుండా, ఎవరూ నిరాశ
పడకుండా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సిద్ధం చేసేలా జగన్ దృష్టి సారించడంతో పార్టీలో ఉత్సాహం మరింత వెల్లువెత్తుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే మంత్రి పదవులు చేపట్టినవారితోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమితులైన అందరితోనూ జగన్ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల అసంతృప్తులందరికీ ఒకేసారి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి వీలవుతుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 27న మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని ఎలా పటిష్టంగా ఉంచాలి.. గ్రౌండ్ లెవల్ లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్నదానిపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు మధ్య సత్సంబంధాలు ఉండేలా చూడడంతోపాటు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకునేలా చూడడం.. ఇది ఈ సమావేశపు ఎజెండా తెలుస్తోంది. జగన్ కూడా త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇప్పటివరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కే పరిమితమైన జగన్.. ప్రజల్లోకి వెళితేనే పట్టు చిక్కుతుందని.. లేదంటే వ్యతిరేక పవనాలు తప్పవన్న సన్నిహితుల హెచ్చరికలతో ఆయన గడప దాటి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిత్యావసరాలతోపాటు అన్నింటి ధరల పెరుగుదలతో ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి నెలకొంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకతగా మారకుండా జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.