CM Jagan: జ‌గ‌న్ `సినిమా` ఆట‌

బీమ్లా నాయ‌క్ ను ఏపీ సీఎం జ‌గ‌న్ అడ్డంగా బుక్ చేశాడ‌ని అర్థం అవుతోంది.

  • Written By:
  • Updated On - March 26, 2022 / 05:46 PM IST

బీమ్లా నాయ‌క్ ను ఏపీ సీఎం జ‌గ‌న్ అడ్డంగా బుక్ చేశాడ‌ని అర్థం అవుతోంది. రాజ‌కీయ ప‌గ‌ను సినిమా విడుద‌ల రూపంలో తీర్చుకున్నాడు. ఎవ‌రు అవున‌న్నా..కాద‌న్నా..ప‌వ‌న్ సినిమా విష‌యంలో ఏపీ స‌ర్కార్ ఆడిన డ్రామా జ‌గ‌ద్వితం. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను ఒక్కో హీరోకు ఒక్కోలా అనుమ‌తించ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌న‌మంటూ జ‌న‌సైనికులు బాహాటంగా సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. వాళ్ల చెబుతున్న దాంట్లో నిజం లేక‌పోలేదు. త్రిబుల్ ఆర్ సినిమా క‌లెక్ష‌న్లు చూస్తుంటే..జ‌గ‌న్ స‌ర్కార్ ఎలా స‌హ‌కారం అందించిందో…అర్థం అవుతోంది. త్రిబుల్ ఆర్ సినిమాకు అడ్డుఅదుపు లేకుండా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు ఇచ్చిన స్వేచ్ఛ‌తో ఇష్టానుసారంగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచేశారు. పాన్ ఇండియా సినిమా అంటూ సామాన్య ప్రేక్ష‌కుల‌ను దోచేసుకుంటున్నారు. ఏపీలో బీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఉన్న ధ‌ర‌ల‌ను అమాంతం త్రిబుల్ ఆర్ రిలీజ్ నాటికి పెంచేశారు. అంతేకాదు, సినిమా థియేట‌ర్ల‌లో చెకింగ్ లు కూడా లేవు. అదే , బీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా రెవెన్యూ సిబ్బందిని ప్ర‌తి థియేట‌ర్ వ‌ద్ద ఉంచారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉండే థియేట‌ర్ల‌ను సీజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో స్వ‌చ్చంధంగా కొన్ని థియేట‌ర్ల‌ను మూసేసుకున్నారు. సినిమా హిట్ అయిన‌ప్ప‌టికీ సంతోషంగా లేదంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల ఒక వేదిక‌పై మ‌నోభావాన్ని వ్య‌క్తం చేశాడ‌ని తెలుస్తోంది.

సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు పెంపు కోసం చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిశాడు. రెండుసార్లు ఆయ‌న క‌లిసి అభ్యర్థించాడు. కానీ, అఖండ , బీమ్లా నాయ‌క్, బంగార్రాజు సినిమాలు విడుద‌ల అయ్యాయి. ఆ త‌రువాత రాధాశ్యామ్ విడుద‌ల సంద‌ర్భంగా ఒక మోస్త‌రుగా ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాకు అమాంతం పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది. సరిగ్గా ఇక్క‌డే రాజ‌కీయ కోణం క‌నిపిస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌రణ్ ఇద్ద‌రూ రాజ‌కీయాల‌కు ఎంతో కొంత ప్రేమ‌యం ఉన్న హీరోలే. తెలుగుదేశం పార్టీతో క‌లిసి జూనియ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు, లోకేష్ కు దూరంగా ఉంటున్నాడు. సానుకూల ప‌రిస్థితులు వ‌స్తే, చిరంజీవిని పార్టీలోకి తీసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ని పార్టీ వ‌ర్గాల టాక్. పైగా రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఫ్యామిలీ ఏపీ జ‌గ‌న్ కుటుంబానికి స్నేహంగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి తీసుకోవాలని ప‌లు. ప్ర‌య‌త్నాలు వైసీపీ చేస్తోంది. జూనియ‌ర్ మామ ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నాడు. మొత్తంగా త్రిబుల్ ఆర్ టిక్కెట్ల ధ‌ర‌ల‌కు ఏ మాత్రం అడ్డూ అదుపులేకుండా జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇదంతా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూస్తున్న జ‌నం ఔరా…అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌ను ఆర్థిక రూపంలో తీర్చుకుంటున్నాడ‌ని జ‌గ‌న్ అప‌వాదును మూట‌క‌ట్టుకున్నాడు. అందుకే, జ‌న‌సైనికులు జ‌గ‌న్ స‌ర్కార్ పై యుద్ధం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..త్రిబుల్ ఆర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ఒక సాధార‌ణ మ‌హిళ సినిమాకు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించి టిక్కెట్ ధ‌ర‌ల‌ను చూసి భ‌య‌ప‌డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె మ‌నోభావాల‌ను రాసింది. ఆమె రాసిన అభిప్రాయం య‌థాత‌దంగా ఇలా ఉంది.

`పొద్దున్న నిద్ర లేచిన దెగ్గర నుండి న్యూస్ చానల్స్ మొదలు సోషల్ మీడియా, మిత్రులు.. ఇలా రక రకాలుగా RRR సినిమా గురించి అద్భుతంగా చెబుతున్నారు. ఒక న్యూస్ రీడరైతే “నేనైతే టికెట్ బుక్ చెస్కున్నా” అని ఉరకలేస్తున్న ఉత్సాహం తో చెప్పగా.. సరే అనుకుని మనకేం తక్కువ ఉత్సాహానికి అనుకుని, వెంటనే చూడాలనుకుని టికెట్స్ బుక్ చేద్దామని బుక్ మై షో ఓపెన్ చేసి నాలుగు టికెట్స్ బుక్ చేయగా 1,670/- బిల్. అర్ధం కాలా.. అయినట్టే అయింది. ఒక్క టికెట్ 413/- ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడే న్యూస్ చానల్ లో స్క్రోలింగ్. 10 రోజుల వరకు టికేట్స్ ఎక్కువ ధరలకి అమ్ముకునే సౌలభ్యం ఉందిట థియేటర్స్ వారికి. ఎందుకో మింగుడు పడలేదు.. ఒకరిద్దరి తో షేర్ చేసుకోగా వారి మాటల్లో… ఈ మధ్యే కదా పెద్ద బడ్జెట్ సినిమాలకి టికెట్ ధర పెంచాలని నా నా రభస జరిగింది అన్నారు. ఇది నిజంగా నాకు తెలియదు, నాకు తెలియకపోయినా ప్రపంచానికి నష్టం లేదు. అయితే..యే సినిమాకైనా చిన్నదైనా పెద్దదైనా 250/- ఉంటుందనే నాకు తెలుసు. అదే టికెట్ ధరకి మగధీర, బాహుబలీ, రంగస్థలం లాంటి సినిమాలు చూసా..కంచర్లపాలెం, మల్లేషం లాంటి సినిమాలు కూడా అదే 250/- టికెట్ కి చూసిన గుర్తు. వందల కోట్ల బడ్జెట్ సినిమాలకి 450, 1000 టికెట్ పెంచితే.. మరి 50 లక్షల బడ్జెట్ సినిమా టికెట్ 50/- కి తగ్గించే వెసులుబాటు కూడా ఉంటుందా.. ఈ వివక్షత, ఈ రేషియో అర్థం కాకే ఈ గోడు. ఈ కరోనా కరువు తరవాత ఇలా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు హెచ్చాయట… !!!!కరోనా టైమ్ లో నే ఆసుపత్రి ల భిల్స్ పెరిగాయి, పెట్రోలూ పెరుగుతూ వచ్చింది.

ఇప్పటికిప్పుడు నూనె, గ్యాస్ ధరలు… సరే ఇదంతా పైసల్లేని మధ్యతరగతి సోది.. వదిలేద్దాం. ఒక సగటు ప్రేక్షకురాలిగా, సగటు గృహిణి గా కొన్ని సందేహాలు…ఒక నలుగురు కుటుంబ సభ్యులు సినిమా చూడాలంటే 1600 ల పై చిలుకు, చక్కగా కార్ లో ఫ్యూయల్ ఒక 500.. లేదా క్యాబ్ లో రానూ పోనూ 600/- ఇంటర్వెల్ లో పిల్లల నోర్లు ఎంత నొక్కినా మొత్తం గా 2,500/- అక్షరాలా రెండున్నర వేలు..!!! వినోదం కోసం తమ ఇష్టమైన దర్శక పటిమ ను, నటీ నటులను వెండి తెరపై కుటుంబం తో కలిసి చూడాలంటే 2,500/- ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సంఖ్యే..!! 250 నుండి దాదాపు రెట్టింపు. వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి, టికెట్ ధరలు పెంచడం సబబే అనుకున్నా… “ఉన్నోడే చూస్తాడు, లేనోడు మూస్కుని కూర్చుంటాడు లేదా ఓ.టి.టి. లో చూస్తారు” అని అనుకున్నా… ఒక్క మాట..!!!  స్టార్ హొటల్ స్థాయి వారు 400 ఏం ఖర్మ.. 4000 ఐనా సరే చూస్తారు. కానీ పేద మధ్య తరగతి వారు..??? తారలకి, నట కిరీటులకు కటౌట్స్ కట్టి, పాలాభిషేకాలు చేసి, తమ అభిమాన నటులు కనబడగానే పూనకం వచ్చినట్టు అరిచి, చొక్కా లు చించుకుని, ఆనంద బాశ్పాలు కార్చి, వారి పేరు మీద రక్త దానాలు చేసేది మధ్య, దిగువ తరగతి వారే..!!

ఇలాంటి అభిమానులు మొదటి ఆటో ఆ మరుసటి రోజు ఆటకో వెళ్లాలంటే డబ్బులుండవు, ఇంట్లో దారిద్ర్యం… పెళ్లాం పుస్తెలు తాకట్టు పెట్టో అప్పు చేసో వీలైతే దొంగతనం చేసో (ఇది కూడా ఒక సినిమాలో చూసా) చూస్తారు. వినోదం ఉండాలి, కావాలి తప్పకుండా. కానీ వ్యాపార వర్తక దోపిడీ వ్యవస్థ లో ఈ కళామతల్లి కూడా కలిపేస్తే ఎవరితో చెప్పుకోవాలి బాధ…!?ఎటు చూస్తే అటు ఉన్నోడికీ లేనోడికీ, ప్రభుత్వాలకీ రాజకీయలకీ మధ్య నలుగుతోంది కేవలం #మధ్యతరగతి వారే..!! ఇక్కడ నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. రాజమౌళి గారిని కాని, ప్రభుత్వాలని గాని, థియేటర్ ల యజమానులని గాని… తప్పు పట్టడం లేదు. కేవలం ఒక మధ్య తరగతి గృహిణి గా మాత్రమే ఒక వేదన వెలిబుచ్చుతున్నాను. సినిమా రేట్లు పెంచండి తప్పు లేదు. ఒక 30 లేదా 50 పెంచండి. ఒకే సారి రెట్టింపు చేసి నోటు కి తూటు పడే లా గుండెకి చిల్లు వేస్తే… పైసలుంటే ముందే సూషెటోళ్లాం.. చీ మా బతుకుల్ల మన్నువడ అని తమని తాము తిట్టుకునే స్థాయికి అభిమానులను దిగజార్చకండి. ఈ రోదన కూడా పోటే..!! సాధారణ ప్రజానీకానికి మంచి మాటలు చెబుతూ ఆదర్శప్రాయంగా నిలిచే హీరోయిజాన్ని సినిమా డైలాగ్స్ ని నిజ జీవితం లో కూడా అప్లై చేసేలా పెద్దలే చూడాలి…!! శుభం భూయాత్.“ కేసీ అంటూ ముగించింది. సో…రాజ‌కీయ స్వార్థం కోసం సామాన్యుల ఆర్థిక ప‌రిస్థితిని ఆలోచించ‌కుండా ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి జ‌గ‌న్ సహ‌క‌రించ‌డం ఒక తప్పు అయితే, బీమ్లా నాయ‌క్ విష‌యం ఏపీ. ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన తీరు మ‌రో త‌ప్పు. ఫ‌లితంగా సినిమా ధ‌ర‌ల రూపంలో జ‌గ‌న్ క‌క్ష సాధింపు కోసం సామాన్య ప్రేక్ష‌కుల‌ను బ‌లిచేశాడ‌న్న‌మాట‌.