Site icon HashtagU Telugu

CM Jagan : ఢిల్లీ నుంచి తాడేప‌ల్లికి చేరిన జ‌గ‌న్

Jagan mohan reddy

Jagan mohan reddy

ఏసీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తో భేటీ అయ్యార‌ని అధికారికంగా చెబుతున్నారు. కానీ, ఆయ‌న ప‌ర్య‌ట‌న పూర్తిగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల క్ర‌మంలో జ‌రిగింద‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌పై ఢిల్లీ బీజేపీ క‌స‌రత్తు చేస్తోంది. వ‌చ్చే వారం అభ్య‌ర్థిని ప్ర‌కటించే అవ‌కాశం ఉంది. అందుకే, మ‌ద్ధ‌తు కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకున్నార‌ని తెలుస్తోంది. కానీ, సీఎం హోదాలో అపాయిట్మెంట్ తీసుకుని రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం హ‌స్తిన‌కు జ‌గ‌న్ వెళ్లార‌ల‌ని అధికారికంగా చెబుతున్నారు. ఏదైతేనేం, ఢిల్లీ టూర్ ముగించుకుని జ‌గ‌న్ స‌క్సెస్ ఫుల్ గా రాష్ట్రానికి వ‌చ్చార‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై అమిత్ షాతో జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్లుగా స‌మాచారం. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డం వ‌ల్ల ఏపీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని అమిత్ షాకు జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లుగా స‌మాచారం. వీలయినంత త్వర‌గా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని జ‌గ‌న్ ఆయ‌న‌ను కోరిన‌ట్టు తెలుస్తోంది.

ఢిల్లీ టూర్‌కు వెళ్లిన జ‌గ‌న్ గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌లతో భేటీ అయ్యారు. అయితే అమిత్ షాతో భేటీ గురువారం సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డంతో ఢిల్లీలోనే బ‌స చేశారు. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన వెంట‌నే ఆయ‌న ఢిల్లీ నుంచి తిరుగుప్ర‌యాణ‌మ‌య్యారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికే జ‌గ‌న్ తాడేప‌ల్లి చేరుకున్నారు.

ఢిల్లీ వ‌ర్గాల నుంచి తెలుస్తోన్న విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి జ‌గ‌న్ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. అందుకు ప్ర‌తిఫ‌లంగా కొన్ని వ్య‌క్తిగ‌త అంశాలు మ‌రికొన్ని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను నెర‌వేర్చ‌డానికి బీజేపీ పెద్ద‌లు అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా మూడు రాజ‌ధానుల అంశంతో పాటు ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకునేలా అప్పుల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన బ‌కాయిల‌ను ఇప్పించ‌డ వంటి అంశాలున్నాయ‌ని తెలుస్తోంది.