Site icon HashtagU Telugu

AP Kuppam Politics: బాబు కంచుకోటలో ‘జగన్‘ దూకుడు!

Jagan Chandrababu

Jagan Chandrababu

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ తగ్గేదే లే అంటూ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో అన్నా క్యాంటీన్స్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతుంటే, తాజాగా ఏపీ సీఎం జగన్ కుప్పం పాలిటిక్స్ కు తెరలేపారు. బాబు కంచుకోట కుప్పాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని మాస్టర్ స్కెచ్ వేశారు. అందులో భాగంగా సీఎం జగన్ కుప్పం పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం కావడంతో  రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అడుగులు వేస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం పర్యటనకు సంబంధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, MLC భరత్ ఏర్పాట్లు చేస్తున్నారు హెలిప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు.

కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కుప్పం సీటును కూడా కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్ పర్యటనలతో కుప్పం రాజకీయాలు ఆసక్తిగా మారాయి.