ఎన్నికల్లో గెలవలేకనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది

  • Written By:
  • Updated On - October 22, 2021 / 01:17 PM IST

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేక తీవ్ర‌నిరాశ‌తో ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తుంద‌ని ఆరోపించారు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. వైసీపీ ప్ర‌భుత్వంపై దురుద్దేశంతో కొత్త‌త‌ర‌హా నేరాలు వెలుగుచూస్తున్నాయ‌ని… ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పోలీస్ సిబ్బందికి సీఎం తెలిపారు. గురువారం విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో పోలీస్ స్మార‌క దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. అమ‌రులైన పోలీసుల‌కు ఆయ‌న నివాళ్లు అర్పించారు. క‌రోనా వ్య‌తిరేక‌పోరాటంలో బాధితుల కుటుంబాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా రూ.10ల‌క్ష‌ల‌కు పెంచింద‌ని.. కారుణ్య నియామ‌కాలు న‌వంబ‌ర్ 30 లోపు పూర్త‌వుతాయ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

సాంకేతిక, స‌మాజంలో మార్పుల‌తో పోలీసుల‌పై బాధ్య‌త‌లు మ‌రింత పెరిగాయాని తెలిపారు. వైట్ కాల‌ర్ నేరాల నుంచి సైబ‌ర్ నేరాల వ‌ర‌కు పోలీసులు వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నార‌ని.. నేరాలు కొత్త రూపాల‌ను సంత‌రించుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌న్నారు. గ‌త రెండున్న‌ర ఏళ్ల‌లో రాష్ట్రంలో అలాంటి ఒక కొత్త నేరం, నేర‌స్తుల‌ను తాము చూస్తున్నామ‌న్నారు. రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోవ‌డంతో విగ్ర‌హాలు ధ్వంసం చేశార‌ని…దేవాల‌యాల్లో ర‌థాల‌ను త‌గ‌ల‌బెట్టారని ఆయ‌న పేర్కొన్నారు. ఇదే కాక కులాల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించిన‌వారు మ‌తాల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించ‌డానికి వెనుకాడ‌ర‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయ‌కులు పేద‌ల ఇళ్ల నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డానికి కోర్టుల‌ను ఆశ్ర‌యించార‌ని…పేద విద్యార్థుల‌కు ఇంగ్లీష్ మీడియం అందిస్తుంటే దానిపై కూడా కోర్టుకు వెళ్లి ఆపార‌ని పేర్కొన్నారు.

కొన్ని ఛానెళ్లు,వార్తాప‌త్రిక‌లు అబద్ధాలు త‌ప్ప మ‌రేమీ చెప్ప‌డంలేద‌ని..రాజ్యాంగ‌బద్ధంగా ఎన్నుకోబ‌డిన వ్య‌క్తైన త‌న త‌ల్లిని ఉద్దేశించి దుర్భాష‌లాడారన్నారు. ముఖ్య‌మంత్రిని ఇలా దూషించ‌డం స‌రైన‌దేనా…? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.ఇలా చేయ‌డం వ‌ల్ల త‌న అభిమానులు ప్ర‌తీకారం తీర్చుకుంటార‌ని దీంతో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించి దాని ద్వారా మైలేజ్ పొందాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ కోరుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు.
ప్ర‌తిప‌క్ష‌పార్టీ ఏ ఎన్నిక‌ల్లో గెలిచే ప‌రిస్థితి లేద‌ని గ్రహించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. అబ‌ద్దాల‌ను వాస్త‌వాలుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని…డ్ర‌గ్స్ ఏపీ అంటూ సోష‌ల్ మీడియా ద్వారా దుష్ర్పాచారం చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జ‌ల‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని…ఇక్క‌డి పిల్ల‌లను డ్ర‌గ్స్‌కి బానిస‌లైన‌ట్లు చూపించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, విజ‌య‌వాడ సీపీ, డీజీపీ గౌతంమ్ స‌వాంగ్ హెరాయిన్ స్మ‌గ్లింగ్‌కు రాష్ట్రానికి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికి త‌మ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు, పిల్ల‌ల భ‌విష్య‌త్ పాడు చేసేందుకు విష ప్ర‌చారం చేస్తున్నారన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని.. ఇలాంటి అఘాయిత్యాల‌కు పాల్ప‌డేవారిని ఉపేక్షించ‌రాద‌ని ఆయ‌న తెలిపారు. తీవ్ర‌వాదం, చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేసే వ్య‌క్తి ఎంత‌టివారైన స‌హించేంది లేద‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.