Site icon HashtagU Telugu

CM Jagan: ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్.. నెలలో 16 రోజులైనా అలా చేయకపోతే నో టిక్కెట్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైపీసీ ప్రాంతీయ సమన్వయకర్తలు అందరూ పాల్గొన్నారు. అదేమీ రొటీన్ సమావేశం కాదని.. ఆ మీటింగ్ స్టార్ట్ అయిన కాసేపటికే వారికి అర్థమైపోయింది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న తీరుపైనా.. ఎమ్మెల్యేలు, మంత్రులు అందులో పాల్గొనే విధానంపైనా జగన్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్… పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది. తానిప్పుడు కఠినంగా మాట్లాడలేదని ఎవరూ లైట్ తీసుకోవద్దని.. పని చేయనివారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. తరువాత తనను అనుకుని ప్రయోజనం లేదని క్లారిటీ ఇచ్చేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరైనా సరే వారి నియోజవర్గాల్లో తిరగకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. వారందరి పనితీరును గమనించడానికి వీలుగా 175 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమిస్తామని జగనే స్వయంగా చెప్పారు. అంటే ఇక నుంచి ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో ఆ చిట్టా అంతా తన వద్ద ఉంటుందని జగన్ స్వయంగానే చెప్పేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 87 శాతం ఇళ్లకు లబ్ది చేకూర్చామని.. ఆ మంచినే ప్రజలకు చెప్పాలని జగన్ అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో వారంతా గడపగడపకూ వెళ్లడానికి భయపడుతున్నారు. జగన్ నియమిస్తారని చెబుతున్న ఆ 175 మంది పరిశీలకులు ఎవరు.. ఎక్కడుంటారు.. ఏం చేస్తారు.. అన్న వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు వైసీపీ ప్రజా ప్రతినిధులు.