Ticket Prices in AP : టిక్కెట్ ధ‌ర పెంపు ఓకే..బెనిఫిట్ షోల‌కు నో..?

ప్ర‌త్యేక విమానంలో మెగాస్టార్ జ‌గ‌న్ ఇంటికి వెళ్లి రెండు వారాలు గడుస్తోంది.

  • Written By:
  • Updated On - February 3, 2022 / 03:54 PM IST

ప్ర‌త్యేక విమానంలో మెగాస్టార్ జ‌గ‌న్ ఇంటికి వెళ్లి రెండు వారాలు గడుస్తోంది. సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఆన్ లైన్ బుకింగ్ మీద జ‌గ‌న్ స‌ర్కార్ తుది నిర్ణ‌యం కోసం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఎదురుచూస్తోంది. రెండు, మూడు వారాల్లో ఏపీ ప్ర‌భుత్వం అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని సంక్రాంతి విందు ముగిసిన త‌రువాత చిరు వెల్ల‌డించాడు. ఆ రోజు నుంచి సినిమా వాళ్లు టిక్కెట్ల ధ‌ర‌ల వివాదంపై మౌనం వ‌హించారు. ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం కోసం వేచిచూస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలను విడుద‌ల చేయ‌కుండా వాయిదా వేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోపుగా ఏదో ఒక నిర్ణ‌యం జ‌గ‌న్ స‌ర్కార్ నుంచి వ‌స్తోంద‌ని ఆశ‌గా చూస్తున్నారు.ఉచితంగా సినిమాల‌ను చూపిస్తానంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంపై స‌వాల్ విసిరాడు. ఆ త‌రువాత బీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌లను అజ్నాతంలోకి నెట్టాడు. ఆచార్య సినిమా, త్రిబుల్ ఆర్‌, రాధేశ్యామ్ త‌దిత‌ర సినిమాల విడుద‌ల ఇప్ప‌టికీ సందిగ్ధ‌మే. మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్ర‌త్యేక విమానం రాయ‌బారం ఫ‌లిస్తుంద‌ని అంద‌రూ వేచిచూస్తున్నారు. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తును కూడా జ‌గ‌న్ స‌ర్కార్ చేస్తోంది. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఊరిస్తోంది. సినిమా టికెట్ల ధరల పరిశీలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఆధ్వర్యంలోని కమిటీ బుధ‌వారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు కొంద‌రు వ్యక్తిగతంగా మ‌రికొంద‌రు రాతపూర్వకంగా సమస్యలను ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

క‌మిటీని క‌లిసిన త‌రువాత ఛాంబ‌ర్ నాయ‌కులు సానుకూల నిర్ణ‌యం వ‌స్తుంద‌ని ఆశావ‌హ‌దృక్ప‌దంతో ఉన్నారు. అన్ని సెంటర్లలోనూ టికెట్ ధరలు పెంచడానికి స‌న్న‌ద్ధంగా ఉన్న‌ట్టు భావిస్తున్నారు. ధ‌ర‌ల విష‌యంలో అధికారులు చిత్తశుద్ధితో ఉన్నార‌న్న విష‌యాన్ని క‌మిటీని క‌లిసిన సినీ ప్ర‌ముఖులు చెబుతున్నారు. వాళ్ల‌లో సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఓం ప్రకాశ్ , డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధి రాంప్రసాద్ , తెలుగు ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్,ఎగ్జిబిటర్ల ప్రతినిధి బాలరత్నం ఉన్నారు.స్లాబ్ ప‌ద్ధ‌తిను తొలగించాల‌ని చాలా కాలం స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ పోరాడారు. చిన్న సినిమాలు బ‌తికేలా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లు వేదిక‌ల‌పై ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశాడు. సినిమా ఇండిస్ట్రీలోని ఇద్ద‌రు, ముగ్గురు చేతుల్లోకి థియేట‌ర్లు వెళ్ల‌డాన్ని కూడా వ్య‌తిరేకించాడు. ఒక మాఫీగా ఏర్ప‌డి సినిమా క‌లెక్ష‌న్ల‌ను ఇష్టానుసారంగా దందాలుగా మార్చార‌ని ఆరోప‌ణ‌లు చేశాడు. బెనిఫిట్ షోలు వేస్తూ వేలాది రూపాయ‌లకు టిక్కెట్ల‌ను విక్ర‌యించడం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఇలాంటి దోపిడీ ప‌ద్ధ‌తికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్నాడు. దానిపై ప‌వ‌న్ తొలుత సామాజిక‌వ‌ర్గ కోణంలో స్పందించాడు. దీంతో ఆ అంశం వివాదంగా మారింది.

రెండు, మూడు కుటుంబాల‌కు చెందిన వాళ్లే హీరోలు. వాళ్ల‌వే థియేట‌ర్లు, స్టూడియోలు, ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు. దీనితో ఆ కుటుంబాల‌కు మాత్ర‌మే సినీ ప‌రిశ్ర‌మ ప‌రిమితం అయింది. వాళ్ల‌ను కాద‌ని సినిమాలు తీస్తే, వాటిని ప్ర‌ద‌ర్శించ‌డానికి థియేట‌ర్లు ఉండేవికాదు. ఇక ఆ కుటుంబాల‌కు చెందిన హీరోల సినిమాలు రిలీజ్ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల‌న్నీ ఆ సినిమాతోనే ఉండేవి. తొలి వారం రోజులు మొత్తం క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసుకునే దందా న‌డిచేది. ఫ‌లితంగా హీరో రెమ్యునరేష‌న్ అనూహ్యంగా పెంచుకోవ‌డం జ‌రిగింది. ఇలాంటి దోపిడీకి చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.ప్రాంతాల వారీగా ఉండే థియేట‌ర్ల సౌక‌ర్యాల‌కు అనుగుణంగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించింది. థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కు ఉన్న నిబంధ‌న‌ల‌ను బ‌య‌ట‌కు తీసింది. ఆన్ లైన్ విక్ర‌యం చేయ‌డం ద్వారా సంస్క‌రించాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావించింది.ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో హీరో ప‌వ‌న్ తొలిసారిగా ఈ టిక్కెట్ల అంశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాన్ని ఏపీ స‌ర్కార్‌, టాలీవుడ్ మ‌ధ్య వివాదంగా మార్చేశాడు. దాని ప‌రిష్కారానికి ఆచార్య హీరో చిరంజీవి రంగంలోకి దిగాడు. అగాధాన్ని పూడ్చ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. బెనిఫిట్ షోలు మిన‌హా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డానికి ఏపీ స‌ర్కార్ సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద‌ చిరు ప్ర‌య‌త్నం కొంత వ‌ర‌కు ఫ‌లితం వ‌స్తుంద‌ని త్రిబుల్ ఆర్‌, రాధేశ్వామ్‌, బీమ్లా నాయ‌క్ ఎదురుచూస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు సినిమాల విడుద‌ల తేదీల‌పై స్ప‌ష్టత వ‌చ్చే ఛాన్స్ లేదు.