Political Legacy : వారసత్వ రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి 33 ఏళ్ల నుంచి వ్యాపారాలున్నా, ప్రజా సేవ చేయాలనే ఏకైక ఆలోచనతో లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన తెలిపారు. ఇందులో వారసత్వం అనే దానికి తావు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవకాశాలు అనేవి చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వస్తాయని, వాటిని అందిపుచ్చుకునే వారే రాణిస్తారని చంద్రబాబు చెప్పారు. తాను ఎన్నడు కూడా జీవనోపాధి కోసం రాజకీయాలు చేయలేదని ఆయ తేల్చి చెప్పారు. తమకు 33 ఏళ్ల నుంచీ కుటుంబ వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయాలతో(Political Legacy) పాటు వ్యాపారాలు, సినిమాలు, కుటుంబం ఇలా ఎక్కడైనా వారసత్వం అనేది అస్సలు ఉండదని.. వాటన్నింటిలో వారసత్వం ఉంటుందనే ఆలోచనే సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read :AI Data Centers : ఏఐ పెట్టుబడుల రేసులో తెలుగు రాష్ట్రాలు
జగన్‌పై కక్ష సాధింపులకు దిగేది లేదు
‘‘రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితంలోనైనా నేను విలువలను పాటిస్తాను. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే దానికి కారణం మనకున్న విలువలే’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. మాజీ సీఎం జగన్‌పై కానీ, వైఎస్సార్ సీపీ నేతలపై కానీ కక్ష సాధింపులకు దిగేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామన్నారు. జగన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. ‘‘మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా ?’’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. ‘‘ఎవరైనా ప్రజల్ని ఒకసారే మోసం చేయగలరు. నిరంతరం చేయలేరు’’ అని తెలిపారు. ‘‘జగన్ హయాంలో జరిగిన అదానీ విద్యుత్తు కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా?’’ అని మరో విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఆ అంశం ప్రస్తుతం అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు తెలిపారు.