CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని మరికాసేపట్లో సీఎం చంద్రబాబు అమరావతి బయల్దేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కట్టర్ తో సీఎం చంద్రబాబు చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు 100% సాయం అందించండని కేంద్ర మంత్రి కట్టర్ ను సీఎం చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఆర్థిక వృద్దిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించాలని కేంద్రమంత్రిని కోరారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ ను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు సమర్పించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైల్ ఆమోదించారని విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతున్న నేపథ్యంలో అప్పట్లోగా మెట్రో కారిడార్ జాతీయ రహదారులతో అనుసంధానించటం చాలా ముఖ్యమని సీఎం కేంద్రమంత్రికి తెలిపారు. రాజధాని అమరావతికి గేట్వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతం చేయాలని నిర్ణయించారు.
Also Read: Starship Crash: ఎలాన్ మస్క్‌కు భారీ దెబ్బ.. స్టార్‌షిప్ రాకెట్ క్రాష్, వీడియో వైరల్!
విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ఇది చాలా అవసరమని, నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని, మెట్రో ప్రాజెక్టును స్వతహాగా నిర్మించే పరిస్థితి లేదని సీఎం తెలిపారు. సకాలంలో ప్రాజెక్టు గ్రౌండ్ చేసేందుకు ఫేస్ వన్ అనుమతులు భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం తగ్గటమే కాక ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి కట్టర్‌కు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.