Site icon HashtagU Telugu

CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిశపల్లిలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం భారీ ప్యాకేజీని ప్రకటిస్తూ, ఏజెన్సీ సమగ్రాభివృద్ధి, గిరిజనుల సంక్షేమం పట్ల తన ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటించారు. పాడేరు లో జరిగిన సభలో మాట్లాడుతూ, గిరిజనుల చిరకాల ఆకాంక్ష అయిన ఉపాధ్యాయ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 3ను పునరుద్ధరించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాలను దేవుడు సృష్టించిన అద్భుతంగా అభివర్ణించిన చంద్రబాబు, ఇక్కడి స్వచ్ఛమైన కొండలు, సహజసిద్ధమైన ప్రజల మనస్తత్వం తనను ఎంతగానో ఆకర్షించాయని తెలిపారు. మళ్లీ జన్మ లభిస్తే ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే పుట్టాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. గిరిజనుల సహజ నైపుణ్యం, సామర్థ్యాలను ప్రశంసిస్తూ, వారి అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సంపూర్ణ వికాసం సాధ్యమని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మొదటి నుంచే ప్రాధాన్యతనిచ్చిన నాయకుడిగా నిలిచారని, అదే దిశగా తన ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని తెలిపారు.

Mahesh Babu Birthday Special: రాజమౌళి ఇచ్చిన స్పెషల్ అప్డేట్, పోస్టర్ అదిరిపోయింది!

ఏజెన్సీలోని 1,483 గిరిజన గూడెలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ. 2,850 కోట్లు, జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు రూ. 220 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుదలకు రూ. 482 కోట్ల వ్యయంతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఆయన ప్రకటించారు. పాడేరు, రంపచోడవరం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోనూ ఆసుపత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

జీవో నంబర్ 3 రద్దు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమని విమర్శించిన చంద్రబాబు, తమ హయాంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ఆధారంగా గిరిజన యువతకు న్యాయం చేస్తూ జీవో తెచ్చామని, కానీ గత ప్రభుత్వం కోర్టులో సరిగా వాదించకపోవడంతో అది రద్దయిందని తెలిపారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించి, త్వరలోనే ఆ జీవోను పునరుద్ధరించి గిరిజనులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ఏజెన్సీ ఆర్థికాభివృద్ధి కోసం అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ కల్పించి, కాఫీ, మిరియాలు, పసుపు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మెరుగైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెదురు ఉత్పత్తుల ద్వారా 5 వేల మంది గిరిజన మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలను పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి చేసి, యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలైన పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్లవంటివని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Indian Air Force : సింధూర్ ఆపరేషన్‌లో 5 పాకిస్థానీ ఫైటర్ జెట్‌లు కూల్చివేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Exit mobile version