Polavaram project: నేడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్ లు ప్రకటించిన నేపథ్యంలో, సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రాన్ని మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తామని కూటమి పార్టీలుగా మేం హామీ ఇచ్చాం. మేం ఇచ్చిన హామీలకు అనుగుణంగానే మేం పని చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగింది. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి అభినందనలు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో ఉపాధి కల్పించడం, ఆర్థిక పరిస్థితి ట్రాక్ లో పెట్టడంలో కేంద్రం సహకరిస్తుంది. ఇవాళ ఏపీకి శుభ దినం.. శుభ పరిణామం. గోదావరిలో మునిగిన పోలవరాన్ని మళ్లీ గట్టు పైన పెట్టాం. కేంద్ర కేబినెట్ నిధులు ఇవ్వడానికి అంగీకరించడం సంతోషదాయకం. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇదికొంత వెసులుబాటు. జాతీయ ప్రాజెక్టు గా గుర్తించే ముందు ఏపీ ఖర్చు చేసిన 4730 కోట్లును రాష్ట్ర వాటా గా పరిగణించారు. 2026-27 మార్చి నెల లోపు పోలవరం పూర్తి చేసేలా కేంద్ర కేబినెట్ షెడ్యూల్ ప్రకటించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. తొలి డీపీఆర్ ప్రకారం మొత్తం 25,760 కోట్లలో ఇప్పటివరకు విడుదల చేసింది రూ.15,146 కోట్లని చంద్రబాబు తెలిపారు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీకి రూ.1,597 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మిగిలిన 12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అనుమతించిందని చంద్రబాబు తెలిపారు. 2024-25 కు 6వేల కోట్లు, 2025-26 కు 6,157 కోట్లు ఇచ్చేలా కేంద్రం షెడ్యూల్ ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం నిర్ణయం నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి భరోసా నిచ్చేలా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు సాయంతో పాటు రెండు పారిశ్రామిక కారిడార్లను ప్రకటించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రదాని మోడీతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జలవనరులశాఖ డైరెక్టర్ సీఆర్ పాటిల్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం అంజయ్య ఎప్పుడో పునాది వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. కాటన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉన్నా అప్పట్లో బ్రిటన్ పార్లమెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ముందుకు సాగలేదన్నారు.
Read Also: Periods Twice A Month : కొంతమంది స్త్రీలకు నెలకు రెండుసార్లు ఎందుకు పీరియడ్స్ వస్తుంది..?
మాజీ సీఎం వైఎస్ హయాంలో కాంట్రాక్టర్లను మార్చి 2009 వరకూ వారిని పనిచేయకుండా అడ్డుపడ్డారని చంద్రబాబు ఆరోపించారు. అప్పట్లో కాలువల్లో మట్టి మాత్రమే చేశారన్నారు. మధ్యలో రోశయ్య కూడా ఏమీ చేయలేదని, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక టెండర్లు పిలిచారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా దీన్ని గుర్తించిందన్నారు. ఏడు మండలాల కోసం తాను పోరాటం చేసి సాధించానన్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టును పరుగులు తీయించామన్నారు.
ఆ తర్వాత వచ్చిన జగన్.. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ ను మార్చి ప్రాజెక్టును అనాథగా మార్చారన్నారు. రెండేళ్ల పాటు ప్రాజెక్టును అస్సలు పట్టించుకోకుండా వదిలేశారన్నారు. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా.. వైసీపీ ప్రభుత్వ చర్యలతో కాఫర్ డ్యామ్ డిస్ట్రబ్ చేసి గ్యాప్ 1 కొట్టుకుపోయేలా చేశారన్నారు. దీంతో చరిత్రలో ఎప్పుడూ రానంత నష్టం జరిగిందన్నారు. దీంతో వైసీపీ సర్కార్ కట్టిన గైడ్ బండ్ కూడా కుంగిపోయిందన్నారు. కేంద్రం 8 వేల కోట్లిస్తే 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా డబ్బులు మళ్లించుకున్నారని ఆరోపించారు. పోలవరం అథారిటీ కాంట్రాక్టర్ మార్చవద్దని చెప్పినా వినిపించుకోలేదన్నారు. దీని ఫలితాల్ని ఇప్పటికీ అనుభవిస్తున్నట్లు తెలిపారు.