AP CM: జ‌గ‌న్‌ దెబ్బ‌.!

ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క్షాళ‌న జ‌రుగుతోంది. ఎంతో న‌మ్మకంగా ఉండే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ను బ‌దిలీ చేస్తూ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు.

  • Written By:
  • Updated On - February 15, 2022 / 03:33 PM IST

ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క్షాళ‌న జ‌రుగుతోంది. ఎంతో న‌మ్మకంగా ఉండే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ను బ‌దిలీ చేస్తూ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. తొలి రోజుల్లో చీఫ్ సెక్ర‌టరీగా ఉన్న ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స్వ‌చ్చంధంగా త‌ప్పుకోవ‌డానికి కేంద్ర బిందువుగా ఆనాడు ప్ర‌వీణ్ నిలిచాడు. అంతేకాదు, సీఎంవో ఆఫీస్ లోని ఉద్యోగుల‌ను బ‌దిలీ చేయ‌డం కూడా అప్ప‌ట్లో వివాద‌స్ప‌దం అయింది. ఆ త‌రువాత వ‌చ్చిన చీఫ్ సెక్ర‌ట‌రీ నీలం సాహ్ని కూడా సీఎంవో ఆఫీస్ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్రవీణ్ కార‌ణంగా ఇబ్బంది ప‌డ్డార‌ని టాక్‌. సీఎం జ‌గ‌న్ కు రాజ‌కీయ వ్యవ‌హారాల‌ను కూడా చూసే అధికారిగా ఉన్నాడు. ఉత్త‌ర భార‌త దేశంకు చెందిన ఆయ‌న‌కు ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేద‌ని చాలా సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ను ఏపీ సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు. అనేక వివాద‌స్ప‌ద నిర్ణ‌యాల‌ను వెనుక ఆయ‌న ఉన్నాడ‌ని సీఎంవో ఆఫీస్ లోని టాక్‌. తాజాగా ఉద్యోగుల పీఆర్సీ త‌ద‌నంత‌రం జ‌రిగిన స‌మ్మె నోటీస్ విష‌యంలోనూ స‌రైన స‌ల‌హా ఇవ్వ‌లేద‌ని ప్ర‌వీణ్ పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మూడేళ్ల కాలంలో ప‌లు వివాద‌స్ప‌ద అంశాల వెనుక ప్ర‌వీణ్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. అందుకే, ఆయ‌న్ను ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గా బ‌దిలీ చేస్తూ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని టాక్‌. ఇప్ప‌టికే అనేక మంది స‌ల‌హాదారులు జ‌గ‌న్ కు ఉన్నారు. వాళ్ల‌లో సజ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఒక్క‌టే అన్నీ తానై న‌డిపిస్తున్నాడు. మిగిలిన వాళ్లు కేవ‌లం కుర్చీల‌కు మాత్ర‌మే ప‌రిమితం. రాజ‌కీయ నిరుద్యోగాన్ని త‌గ్గించ‌డానికి మాత్ర‌మే జ‌గ‌న్ స‌ల‌హాదారుల పోస్ట్ ల‌ను భ‌ర్తీ చేశాడు. వాళ్ల నుంచి ఎలాంటి స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ఆయ‌న తీసుకోడ‌ని ఎవ‌ర్నీ అడిగిన చెబుతారు. మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ జీవోల‌ను జారీ చేయ‌డంలో ప్ర‌వీణ్ ప్ర‌కాష్ కీల‌కం. ఆయ‌నే అన్నీ చూసుకున్న‌ప్ప‌టికీ కోర్టుల్లో అనేక చిక్కు ఏర్ప‌డ్డాయి. ప‌లు జీవోల‌ను కొట్టివేస్తూ కోర్టులు నిర్ణ‌యం తీసుకున్నాయి. స‌హ‌జంగా దూకుడుగా ఉండే ప్ర‌వీణ్ ఆధ్వ‌ర్యంలో చాలా జీవోలు విడుద‌ల అయ్యాయి. వాటిలో చాలా వ‌ర‌కు వివాద‌స్ప‌దం అయ్యాయి. కొత్త జిల్లాల జీవో విడుద‌ల అయింది. ప్ర‌స్తుతం వాటి గురించి సీరియ‌స్ గా చ‌ర్చ జ‌రుగుతోంది. వాటిని మార్చి నెలాఖ‌రు క‌ల్లా పూర్తిచేసి, ఉగాది నుంచి కొత్త రాజ‌ధాని విశాఖ నుంచి పరిపాల‌న చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. ఆ స్పీడ్ కు త‌గిన విధంగా జీవోల‌ను విడుద‌ల చేయ‌డంలో ప్ర‌వీణ్ స‌హ‌కారం అందించాడు. కానీ, ఇప్పుడు కేంద్రానికి, రాష్ట్రానికి మ‌ధ్య‌న స‌మ‌న్వ‌యం చేసే అధికారి కావాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. అందుకే, న‌మ్మ‌క‌మైన ప్ర‌వీణ్ ను ఢిల్లీ కి బ‌దిలీ చేశాడు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ స‌తీమ‌ణి ఐపీఎస్ అధికారి భావనా సక్సేనా కేంద్ర సర్వీసులకు వెళుతున్నారు. ఆ స్థానంలో ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమించింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశాడు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలంపాటు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) పోస్టును కూడా నిర్వహించాడు.

ఆ టైంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న సబ్జెక్టుల్లో కొన్ని కీలకమైన వాటిని ఇటీవల ఆయన నుంచి తప్పించి వేరేవారికి అప్పగించారు. కాగా, గత కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రకాశ్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం మాత్రం ఆయనను ఎంప్యానెల్‌ చేయలేదు. దీంతో రాష్ట్ర కేడర్‌లోనే ఆయన ఢిల్లీకి వెళ్తుండడం గమనార్హం. మొత్తం మీద కొత్త పాల‌న కోసం అత్యంత న‌మ్మ‌క‌మైన వాళ్ల‌ను సీఎంవో ఆఫీస్ లో జ‌గ‌న్ ప్ర‌క్షాళ‌న చేస్తున్నాడు. అదే సంద‌ర్భంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ను బ‌దిలీ అయ్యాడు. చ‌లో విజ‌య‌వాడ ఎఫెక్ట్ ఆయ‌న మీద ప‌డింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్ట్ చేసేలా స‌వాంగ్ ను బ‌దిలీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా నమ్మ‌క‌మైన వాళ్ల‌ను నియ‌మించుకున్నాడ‌ని ప్ర‌వీణ్ అనుచ‌రులు చెబ‌తున్నారు. ఇక ప‌రిపాల‌న వేగ‌వంతం చేయ‌డానికి జ‌గ‌న్ పూనుకున్నాడు. ఆ స్పీడ్ ను తట్టుకునేలా ఏర్పాట్లు చేసుకుంటోన్న ఆయ‌న పాల‌న జ‌న‌రంజ‌కంగా ఉండాల‌ని సీనియ‌ర్ ఐఏఎస్ ల‌ను చేర‌దీస్తున్నాడు. న‌మ్మ‌క‌స్తులు అయిన‌ప్ప‌టికీ ప‌నితీరు మెరుగ్గా లేక‌పోతే ఎలాంటి వాళ్ల‌కైన ప‌నిష్మెంట్ త‌ప్ప‌ద‌ని సంకేతాలు ఇచ్చేలా స‌వాంగ్‌, ప్ర‌వీణ్ మీద బదిలీ వేటును జ‌గ‌న్ స‌ర్కార్ వేసింది. కొత్త టీంతో కొత్త పాల‌న సాగించ‌డానికి జ‌గ‌న్ చేస్తోన్న క‌స‌ర‌త్తు ఎలా ఫ‌లిస్తుందో.. చూద్దాం.!