ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనలో ఉన్న అసంబద్ధతలను సరిదిద్దడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయడంపై మంత్రుల బృందంతో సీఎం సమీక్షించనున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భౌగోళిక మార్పులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. విభజన సమయంలో కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి చాలా దూరమయ్యాయని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే మరో 3 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపితే, రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగడంతో పాటు పరిపాలన మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
AP Cabinet meeting
జిల్లాల పునర్విభజనతో పాటు మరికొన్ని కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రెవెన్యూ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు రానున్న కాలంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
