AP Cabinet meeting on 18: ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు కేబినెట్ సమావేశాలు జరిగాయి. అయితే వాటన్నింటి కంటే ముఖ్యంగా ఈసారి కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
భవిష్యత్తులో వరదల నియంత్రణకు మంత్రుల కమిటీ..
రాష్ట్రాన్ని ఇటు విజయవాడ వరదలు, అటు ఏలేరు వరదలు చుట్టుముట్టాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు గండ్లు తెంపుకుని వేల కొద్దీ గ్రామాల్ని ముంచెత్తింది. అలాగే విజయవాడ నగరంపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వరదల నియంత్రణ కోసం బుడమేరు ఆధునికీకరణ, ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరద నష్టం అంచనాతో పాటు భవిష్యత్తులో వరదల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సమావేశమైంది.
15 వేల కోట్ల మేర రుణం..
అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంపై ఈసారి కేబినెట్ లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ వరదలపైనా ఆరా తీశారు. అయితే అమరావతి రాజధానికి వరదల ముప్పు లేదని వారికి సీఆర్డీఏ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిపి 15 వేల కోట్ల మేర రుణం అందించే అవకాశాలున్నాయి. ఇది వచ్చాక చేపట్టబోయే కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో మరికొన్ని ఇతర అంశాలపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
కొత్త మద్యం పాలసీ పై నిర్ణయం..
ఈ నేపథ్యంలో వరద నష్టం , ఆపరేషన్ బుడమేరు, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ , ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15 వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు. అయితే ఈ సమావేశంలో కొత్త మద్యం పాలసీ ఈ గురించి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. నాణ్యమైన మద్యం కూడా వస్తుందని చెబుతున్నారు.