AP Cabinet Meeting : అమరావతిలోని ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో దాదాపు 20కిపైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025–30కు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపుపై రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలించనున్నారు. అలాగే అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్‌గా మార్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది.
వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చే ప్రక్రియలో అవసరమైన చట్టసవరణలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 51వ సీఆర్‌డీఏ సమావేశం ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పోజెస్) చట్టం, 2006 రద్దుకు సంబంధించి బిల్లుకు ఆమోదం తెలుపనుంది. అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు అనుమతి ఇవ్వనుంది. సీఆర్‌డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపుల సమీక్ష, ఉపసంఘం సిఫార్సులపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి జీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం-2022లో మార్పులు చేయడం, అలాగే డిప్యూటేషన్ మరియు ఔట్‌సోర్సింగ్ ద్వారా 2,778 పోస్టులను భర్తీ చేయడానికి మంత్రివర్గం అనుమతి ఇవ్వనుందని సమాచారం.
అదేవిధంగా మద్యం ప్రాథమిక ధరలపై, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులపై కూడా కేబినెట్ చర్చ జరగనుంది. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాకినాడ జిల్లా గన్నేపల్లి మండలం తాలూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రధాన కాల్వ అభివృద్ధి పనులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా విస్తరించి, 56 కొత్త పోస్టులను మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇవేకాకుండా.. పీఆర్ అండ్ ఆర్‌డీ చట్టం 1994లో సవరణల కోసం డ్రాఫ్ట్ ఆర్డినెన్స్.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు, సౌర శక్తి రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి అదానీ సౌర ప్రాజెక్ట్ కోసం భూముల లీజ్.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్‌కు స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లలో మార్పులు చేయడం కూడా ఈ సమావేశ అజెండాలో ఉంది.
B Sudershan Reddy : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్..