Site icon HashtagU Telugu

AP Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు?

Ap Assembly

Ap Assembly

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం క్షేత్రస్థాయి పోరాటంతోపాటు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తోంది. దీనికితోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ ఇబ్బందికరంగా మారుతోంది. భారీగా అమలవుతున్న సంక్షేమ పథకాల ఖర్చుకు తగ్గ ఆదాయం రావడం లేదు. దీంతో సమావేశాల్లో ప్రజా సమస్యలపై తీవ్రమైన చర్చ జరిగే ఛాన్సుంది.

ఈ సమావేశాలు దాదాపు మూడు వారాల పాటు కొనసాగవచ్చు. గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు తీసుకున్న తరువాత సభను ఉద్దేశించి తొలిసారిగా ప్రత్యక్షంగా ప్రసంగించే సమావేశాలివి. ఈసారి సభలో దాదాపు 20 బిల్లుల్ని ప్రవేశపెట్టవచ్చు. ముఖ్యంగా ఆదాయం-అప్పులు-ఖర్చులు విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంది.

కిందటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం తీరుపై మనస్తాపం చెందిన చంద్రబాబు.. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని.. అప్పటివరకు అసెంబ్లీకి రానని గట్టిగానే చెప్పారు. అందుకే ఈసారి చంద్రబాబు తప్ప మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరవుతారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించవచ్చు.

కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన వైసీపీ.. ఇప్పటివరకు ఎందుకు తేలేదన్న అంశంపై చర్చ జరగొచ్చు. నిరుద్యోగం, రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థ దీన పరిస్థితి, అక్రమ మైనింగ్.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 19 అంశాలపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. మరి ప్రభుత్వం ఆ అంశాలపై చర్చ జరుపుతుందా లేదా అన్నది చూడాలి.