AP Budget : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ..2025-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కోసం రూ. 1,228 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడికి వెళ్లడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను సరి చేసేందుకు అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తన భజస్కందాలపై వేసుకున్నారని చెప్పారు.
Read Also: AP Budget 2025-26 : ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా
ప్రతి తన పిల్లలను తల్లి పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పర్చే దిశగా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద రూ. 15 వేలు ఆర్థిక సాయాన్ని తల్లికి అందించనున్నామని తెలిపారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులు అనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు మంత్రి నారా లోకేశ్. రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో రాష్ట్ర పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించడానికి సిద్ధమవుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారమ్‌లు అందిస్తున్నామని, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.