Site icon HashtagU Telugu

AP Budget : ఏపీ బడ్జెట్ 2025.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం కోసం కీలక నిర్ణయాలు

Appointment of chairmen for AP assembly committees.

Appointment of chairmen for AP assembly committees.

AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ఏడాది బడ్జెట్ ప్రధాన లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటును 15 శాతం దాటించటం , 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచి, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని పణం వేసింది. బడ్జెట్‌లో ప్రభుత్వం తమ పథకాల అమలుకు తగిన నిధులను కేటాయించడమే కాక, వాటి ఆర్థిక ప్రభావాలను సమీక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.

సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రధానమైనవి. ఈ పథకాలలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నవి, మరికొన్నింటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీల అమలుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంటుందట. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా, సంక్షేమ పథకాలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడినట్లుగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

 Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

రాజధాని అభివృద్ధి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు ప్రకటించింది. మూడేళ్లలో రూ.60,000 కోట్ల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ సంస్థలు, వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుండి రూ.30,000 కోట్ల పైగా రుణాల కోసం హామీ తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై బడ్జెట్ సమయంలో మరింత క్లారిటీ ఇవ్వబడుతుంది. పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన రహదారి కనెక్టివిటీ, పరిశ్రమల వృద్ధి, పునరుత్పత్తి శక్తి రంగంలో పెట్టుబడులపై బడ్జెట్‌లో ప్రధాన దృష్టి ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌లు, తయారీ పరిశ్రమల వృద్ధి తదితర రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సేవలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆర్థిక శాఖకు 28 శాఖల బడ్జెట్ సమీక్షలు పూర్తయ్యాయి. మంత్రులు తమ శాఖలకు అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ రూ.37,000 కోట్లు కావాలని కోరగా, ప్రభుత్వం రూ.27,000 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచేలా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులకు సమతుల్యత కల్పించేలా ఉండాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 Chardham Yatra: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 11 నుంచి ఆన్‌లైన్‌లో!