Minister Lokesh Dallas Tour : స్పీడ్‌ కు ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌ – నారా లోకేష్

Minister Lokesh Dallas Tour : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కు డల్లాస్‌లో అపూర్వ స్వాగతం లభించింది.

Published By: HashtagU Telugu Desk
Lokesh Dallas2

Lokesh Dallas2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కు డల్లాస్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ఎన్నారై టీడీపీ నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. డల్లాస్‌ శివారు ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ‘డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్’ నడుస్తోందని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రం ‘స్పీడ్’ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిందని గర్వంగా ప్రకటించారు.

గత ఐదేళ్లలో ఏపీ నుంచి వచ్చామని చెప్పుకోవడానికి సిగ్గుపడిన పరిస్థితి నుంచి, నేడు అన్ని రంగాల్లో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారిందని తెలిపారు. లోకేష్ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ, ఉపాధి కల్పనపై కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ఈ వేదికగా స్పష్టం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ తమ నినాదమని లోకేష్ పునరుద్ఘాటించారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ, అనంతపురంను ఆటోమోటివ్ హబ్‌గా, కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ ఫ్యాక్టరీల కేంద్రంగా, చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్

అలాగే నెల్లూరుకు డైవర్సిఫైడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, సోలార్‌ సెల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ప్రకాశం జిల్లాకు సీబీజీ హబ్‌, కృష్ణా-గుంటూరులో రాజధానితో పాటు క్వాంటమ్‌ కంప్యూటర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీలు, ఉత్తరాంధ్రకు ఐటీ, ఫార్మా, మెడికల్‌ డివైసెస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు ఆర్సెల్లర్‌ మిత్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను తీసుకువస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.

ప్రధానంగా కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకుందని లోకేష్ స్పష్టం చేశారు. తన ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా గంగాధర నెల్లూరులో బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిసినప్పుడు, తన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఆమె అభ్యర్థించారని గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత 17 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకుందని ప్రకటించారు.

ఈ ఒప్పందాలన్నింటినీ రాబోయే మూడు నెలల్లో గ్రౌండ్‌ చేసి, పనులు ప్రారంభించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ గారు ప్రవాసాంధ్రులకు హామీ ఇచ్చారు. ఈ విధంగా, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన కోరారు.

  Last Updated: 07 Dec 2025, 01:01 PM IST