Site icon HashtagU Telugu

బాబు, జ‌గ‌న్ కౌగిలిలో ‘ప్ర‌జాగ్ర‌హ‌స‌భ‌’

Somu Veerraju New

Somu Veerraju New

ఏపీ బీజేపీ విజ‌య‌వాడ కేంద్రంగా ప్ర‌జాగ్ర‌హ‌స‌భను పెట్టింది. జ‌గ‌న్ స‌ర్కార్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన స‌భ‌కు కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్, ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్ తో స‌హా ఏపీ బీజేపీ సీనియ‌ర్లు హాజ‌ర‌య్యారు. ఆ స‌భ‌కు ఒక రోజు ముందు నుంచే బీజేపీపైన‌ టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దాడికి దిగ‌డం గ‌మ‌నార్హం. ఈ పరిణామాన్ని చూస్తుంటే..బీజేపీకి ఎవ‌రికి వాళ్లే దూరం కావాల‌నుకుంటున్నారా? అనే భావ‌న క‌లుగుతోంది.పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల పెంపు, నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, సీఏఏ..త‌దిత‌రాల కార‌ణంగా దేశ వ్యాప్తంగా బీజేపీ మీద వ్య‌తిరేక‌త ఉంది. ప్ర‌త్యేకించి రాష్ట్రాన్ని విడ‌దీయ‌డానికి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ స‌హ‌కారం అందించిన బీజేపీ అంటే ఏపీ ఓట‌ర్ల‌కు మంట‌. అంతేకాదు, అమ‌రావ‌తి రాజ‌ధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌, పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా త‌దిత‌ర విభ‌జ‌న అంశాల‌పై అన్యాయం చేసిన క‌మ‌ల‌నాథులు అంటే ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏవ‌గింపు. ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌లిగిన బీజేపీకి తాము ద‌గ్గ‌ర కాదంటే..తాము కాదు..అనే సంకేతం బ‌లంగా పంప‌డానికి వైసీపీ, టీడీపీ నానా తంటాలు ప‌డుతున్నాయి.

కేంద్రంలోని బీజేపీని నేరుగా ఢీ కొట్టే స‌త్తా ఏపీలోని ప్ర‌ధాన పార్టీల‌కు లేదు. ఢిల్లీ వెళ్లి మోడీ స‌ర్కార్‌పై ఉద్య‌మించే ధైర్యం టీడీపీగానీ, అధికారంలోని వైసీపీగానీ లేద‌ని అంద‌రికీ తెలుసు. దానికి స్వ‌ప్ర‌యోజ‌నాలు కార‌ణ‌మ‌ని కూడా చాలా మందికి తెలిసిన విష‌యమే. అదే స‌మ‌యంలో బీజేపీకి తాము ద‌గ్గ‌ర కాద‌నే సంకేతం ప్ర‌జ‌ల్లోకి పంప‌లేక‌పోతే..రాబోయే ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌ని అంచ‌నా వేస్తున్నాయి. అందుకే, ప్ర‌జాగ్ర‌హ స‌భ‌కు వ్య‌తిరేకంగా రాష్ట్రంలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీ ప‌డి బీజేపీపై విరుచుకు ప‌డుతున్నాయి. ఎవ‌రి కోణంలో వాళ్లు రాజ‌కీయ అస్త్రాల‌కు ప‌దును పెట్టారు.తెలుగుదేశం పార్టీ ఏకంగా బీజేపీ, వైసీపీని ఏక‌కాలంలో టార్గెట్ చేసేలా మాట్లాడుతోంది. అందుకోసం స్వామీజీల వాయిస్ ను కూడా క‌లుపుకుని పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. హిందూ వ్య‌తిరేక పాల‌న ఏపీలో సాగుతుంద‌నే సంకేతాన్ని టీడీపీ తీసుకెళుతోంది. దానికి మ‌ద్ధ‌తుగా కొంద‌రు స్వామిజీలు కూడా అదే మాట‌ను చాటుతున్నారు. హిందువులను అణచివేసేందుకు రహస్య అజెండాతో జ‌గ‌న్ స‌ర్కార్ వెళుతోంద‌ని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హిందూ సమాజాన్ని దారుణంగా అవమానిస్తోందని మండిపడ్డాడు. రామతీర్థం రామాలయాన్ని మ‌ళ్లీ సీన్లోకి తీసుకొచ్చాడు. వైసీపీ అంటే వైయస్సార్ క్రిస్టియన్ పార్టీ అంటూ ఆ పార్టీ పేరునే హిందూ వ్య‌తిరేకంగా ఉండేలా అభివ‌ర్ణించాడు.

బీజేపీ అంటే భార‌తీయ జ‌గ‌న్ పార్టీ అంటూ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ ప‌య్యావుల కేశ‌వ్ ధ్వ‌జ‌మెత్తాడు. వైసీపీ నెట్ వ‌ర్క్ లో బీజేపీ న‌డుస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తాడు. విజ‌య‌వాడ‌లో జ‌రుగుతోన్న ప్ర‌జాగ్ర‌హ‌స‌భ‌ను వైసీపీ అనుగ్ర‌హ స‌భ‌గా అభివ‌ర్ణించాడు. జ‌గ‌న్ మీద ఉన్న కేసుల గురించి బీజేపీ ఎందుకు మాట్లాడ‌ద‌ని నిల‌దీశాడు. ఇన్నేళ్లుగా ఒక‌నేర‌స్తుడ్ని కాపాడుతోన్న బీజేపీ విజ‌య‌వాడ‌లో అనుగ్ర‌హ స‌భ‌ను పెట్టిందంటూ టార్గెట్ చేశాడు.
ఏపీ బీజేపీని సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్ ల‌కు లీజుకు ఇచ్చేశార‌ని మంత్రిపేర్నినాని ఆరోపిస్తున్నాడు. చంద్ర‌బాబు బినామీలు గా ఉన్న వాళ్లిద్ద‌రూ ఏపీ బీజేపీని న‌డుపుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించాడు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగ‌జారిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తాడు. ఏపీ అప్పుల గురించి ప్ర‌జాగ్ర‌హ‌స‌భ పెట్టిన బీజేపీ దేశానికి ఎంత అప్పు ఉందో చెప్పాల‌ని నిల‌దీశాడు. మొత్తం మీద ఏపీ బీజేపీని అటు వైసీపీ ఇటు టీడీపీ ఎవ‌రికి అనుకూలంగా వాళ్లు టార్గెట్ చేశారు. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ బీజేపీ, చంద్ర‌బాబు బీజేపీలాగా ఏపీ బీజేపీ ఉంద‌నే అభిప్రాయం క‌ల‌గ‌డంలో త‌ప్పులేదేమో!