Site icon HashtagU Telugu

YSRCP Vs BJP : జ‌గ‌న్ స‌ర్కార్ పై `బుల్డోజ‌ర్ `

Jagan Amitshah Undavalli

Jagan Amitshah Undavalli

“ఏపీ చ‌రిత్ర‌లో 50శాతం పైగా ఓట్లు సాధించిన ఏ ప్ర‌భుత్వ‌మూ ఐదేళ్ల పాటు ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా ఐదేళ్లు ఉంటుంద‌ని న‌మ్మ‌కం లేదు“ అంటూ ఏడాదిన్న‌ర క్రిత‌మే మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి సెంటిమెంట్ ను రంగ‌రించాడు. ఉమ్మ‌డి ఏపీలో 50శాతంపైగా ఓట్ల‌తో ఏర్ప‌డిన స్వ‌ర్గీయ పీవీ, ఎన్టీఆర్ ప్ర‌భుత్వాలు ఐదేళ్లు పూర్తి కాకుండానే ప‌డిపోయ‌ని దృష్టాంతాల‌ను ఆనాడు ఉండ‌వ‌ల్లి గుర్తు చేశాడు. స‌రిగ్గా, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంటుందా? ఊడుతుందా? అనే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.మంత్రివ‌ర్గాన్ని పూర్తిగా మార్చేస్తాన‌ని జ‌గ‌న్ రెండు వారాల క్రితం ప్ర‌కటించాడు. ఆ రోజు నుంచి నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి వాదులు తెర‌వెనుక రాజ‌కీయాల‌ను చ‌క్క‌దిద్దుకుంటున్నారు. రాబోవు రోజుల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో వెళ‌తాయ‌ని సంకేతాలు ఉండడంతో ముందుగానే అప్ర‌మ‌త్తం అవుతున్నారు. పైగా ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 70 మందికి టిక్కెట్లు తిరిగి ఇచ్చే పరిస్థితి లేద‌ని జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చాడు. ఆ క్ర‌మంలో పార్టీని వీడేందుకు చాలా మంది సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అలాంటి వాళ్ల కోసం బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కాచుకుని ఉన్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌ను 100 చోట్ల నియ‌మించిన టీడీపీ వాళ్ల‌కే టిక్కెట్లు ఇస్తామ‌ని చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చాడు. మిగిలిన 75 స్థానాల్లో మాత్రం పొత్తుల కోసం ఆచితూచి అడుగు వేస్తున్నాడు. బీజేపీ, జ‌న‌సేన‌కు అభ్య‌ర్థుల కొర‌త ఉంది. అందుకే, ఆ రెండు పార్టీలు వైసీపీ నుంచి వ‌చ్చే అసంతృప్తివాదుల‌కు గాలం వేయ‌డానికి సిద్ధం అయ్యాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ప్రారంభం అయింద‌ని టాక్‌.

సుమారు 45 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పై అసంతృప్తిగా ఉన్నార‌ని బీజేపీ భావిస్తోంది. మంత్రివ‌ర్గానికి రాజీనామా చేసిన త‌రువాత స‌గం మంది మంత్రులు బీజేపీ వైపు చూసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రాజ్యాధికారం దిశ‌గా ద‌క్షిణ భార‌త దేశంపై దండ‌యాత్ర చేస్తోన్న బీజేపీ యోగి త‌ర‌హా బుల్డోజ‌ర్ల‌ను ఏపీపైకి పంపాల‌ని చూస్తోంది. వ‌చ్చే నెల 17వ తేదీ నుంచి అమిత్ షా ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ప్రారంభం కానుందని క‌మ‌ల‌నాథులు ఆశ పెట్టుకున్నారు. ప‌వ‌న్ ఫేస్ ను చూపించ‌డం ద్వారా అధికారంలోకి రావాల‌ని బీజేపీ స్కెచ్ వేస్తోంది. ఆ క్ర‌మంలో టీడీపీ, వైసీపీ పార్టీల‌ను వీలున్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో డ్యామేజ్ చేసే ఎత్తుగ‌డ‌లను క‌మ‌ల‌నాథులు ర‌చిస్తున్నారు.వాస్త‌వంగా జ‌గ‌న్ మీద ఆయ‌న స‌ర్కార్ మీద అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు గ‌త ఏడాది కొంద‌రు గ‌ళం విప్పారు. సుమారు 10 మంది వ‌ర‌కు ఆనాడే బ‌య‌ట ప‌డ్డారు. ఇంకా బ‌య‌ట ప‌డ‌కుండా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నార‌ని బీజేపీ, టీడీపీ చెబుతున్న మాట‌లు. అవే, నిజం అయితే…క్యాబినెట్ మార్పుల త‌రువాత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వ‌ల‌స‌లు ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌ని కూడా కొంద‌రు బీజేపీ నేత‌లు గ‌త ఏడాది ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా వ్యాఖ్య‌లు చేశారు. ఆ దిశ‌గా బీజేపీ దూకుడుగా వెళితే ఏదైనా జ‌రిగే అవకాశం ఉంది.

మూడేళ్ల త‌రువాత ఇటీవ‌ల జ‌రిగిన వైఎస్సాఎల్పీ స‌మావేశంలో ఎమ్యెల్యేలు, మంత్రుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశాడు. రెండేళ్లలో రాబోతున్న ప‌రీక్ష‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చాడు. మంత్రులుగా ఉన్న క్రేజ్ ను పార్టీకి ఉప‌యోగించాల‌ని కోరాడు. జిల్లా అధ్య‌క్షులు, రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా ఇప్పుడున్న మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని సంకేతం ఇచ్చాడు. మంత్రివ‌ర్గం సంపూర్ణంగా మారుతుంద‌ని సంకేతాన్ని జ‌గ‌న్ ఇచ్చేశాడు. ఏప్రిల్ 2 వ తేదీ నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని సూచించాడు. కానీ, ఆ లోపే చాలా మంది ప‌క్క పార్టీల వైపు ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని తెలుస్తోంది.ఏపీలోని 175 నియోజ‌కవ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇంచార్జిల పనితీరుపై జ‌గ‌న్ స‌ర్వేలు చేయించాడు. వాటి ఫలితాల ఆధారంగా మాత్ర‌మే పార్టీ టిక్కెట్ల‌ను కేటాయిస్తుంద‌ని వైఎస్సార్ ఎల్పీ స‌మావేశంలో తేల్చి చెప్పాడు. ఆ స‌ర్వేల్లో వెనుక‌బ‌డిన వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా లేద‌ని క‌రాఖండిగా చెప్పాడు. మంత్రులు ప‌నితీరుపై స‌ర్వేలు చేయించుకున్న జ‌గ‌న్ కొంద‌రికి మాత్ర‌మే పార్టీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నాడు. ఇప్పుడున్న మంత్రివ‌ర్గంలోని మంత్రులు రాజీనామా ఏ రోజైనా చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న మంత్రుల్లో 90శాతం మంది రాజీనామా చేస్తార‌ని తెలుస్తోంది. మంత్రివ‌ర్గంలోని 90శాతం మంది ప‌నితీరు బాగాలేద‌ని స‌ర్వేల సారాంశం. కొంద‌రు డ‌బ్బు సంచుల‌తో దొరికిన ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. అలాంటి వాళ్ల‌కు స్తానికంగా కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేల ద్వారా జ‌గ‌న్ తెలుసుకున్నాడని గుస‌గుస‌లు ఉన్నాయి.

నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మంత్రివ‌ర్గం మార్పు త‌రువాత భ‌గ్గుమ‌నే ఛాన్స్ ఉంది. రెండేళ్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి టైం ఉన్న‌ప్ప‌టికీ వ‌చ్చే ఏడాది నుంచి ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభం కానుంది. అందుకే, ఇప్పుడే ఒక దారి చూసుకోవాల‌ని మంత్రి ప‌ద‌వులు కోల్పోతున్న వాళ్లు కొంద‌రు, స‌ర్వేల్లో వెనుక‌బ‌డిన ఎమ్మెల్యేలు, అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఇత‌ర పార్టీల‌కు వెళ్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మూడేళ్ల కాలంలో జ‌గ‌న్ స‌ర్కార్ పై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆ పార్టీ కీల‌క లీడ‌ర్లే భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో పెద్ద ఎత్తున వైసీపీ ఖాళీ అవుతుంద‌ని , ప్ర‌భుత్వం ప‌డిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని కొంద‌రు అంత‌ర్గ‌తంగా చెప్పుకోవ‌డం విచిత్రం. పైగా విజ‌య‌మ్మ పార్టీకి రాజీనామా చేశార‌ని టాక్‌. బ్ర‌ద‌ర్ అనిల్ కొత్త పార్టీ ఏపీలో పెడుతున్నారు. అందుకు సంబంధించిన స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఫ‌లితంగా రాబోవు రోజుల్లో వైసీపీలో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంద‌ని భావిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి జోస్యాన్ని మ‌రోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎంత వ‌ర‌కు ఆయ‌న జోస్యం, ఏపీ సెంటిమెంట్ నిజ రూపంలోకి వ‌స్తాయో..చూడాలి.