Site icon HashtagU Telugu

Ap bjp: ఏపీ బీజేపీ `16 రోజుల` షెడ్యూల్‌

Somu Veerraju

Somu Veerraju

ఈనెల 21వ తేదీన ప్రపంచ యోగా’ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో సేవా,స్వచ్ఛంద సంస్థలు,విద్యాసంస్థలు, ప్రజా భాగస్వామ్యంతో ‘యోగా’ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ ప్రకటించింది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసిన జూన్ 23వ తేదీ నుండి ఆయ‌న‌ జన్మదినమైన జూలై 6 వ తేదీ వరకు బూత్, మండల జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాలను వెల్ల‌డించింది.

మొక్కలు నాటడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పధకాలను ప్రజలకు వివరించే విధంగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టంచేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ తెలిపింది. 1975 జూన్ 25వ తేదీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి, సాగించిన అరాచక పాలనను, ప్రజలకు వివరిస్తూ జూన్ 25 న సభలు సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ ప్రకటించింది.

ఈ నెల 26 వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహించే, మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం మరింత పెంచేలా కార్యక్రమం నిర్వహిస్తామని పార్టీ తెలిపింది. భీమవరంలో జులై 4 వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి కార్యక్రమ సభలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ తెలిపింది.