Badvel :టీడీపీ, జ‌న‌సేన‌కు బ‌ద్వేల్ ద‌డ.. ఏపీపై బీజేపీ రాజ‌కీయ మెరుపుదాడి.?

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌ర్లు చాలా ఈజీగా బీజేపీ వైపు మ‌ళ్లారు. ఫ‌లితంగా 21వేల‌కు పైగా ఓట్ల‌ను సంపాదించుకున్న బీజేపీ కొత్త ఊత్సాహంతో ఉంది.

  • Written By:
  • Updated On - November 2, 2021 / 01:36 PM IST

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌ర్లు చాలా ఈజీగా బీజేపీ వైపు మ‌ళ్లారు. ఫ‌లితంగా 21వేల‌కు పైగా ఓట్ల‌ను సంపాదించుకున్న బీజేపీ కొత్త ఊత్సాహంతో ఉంది. మొద‌‌టిసారిగా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో డిపాజిట్ల‌కు ద‌రిదాపుకు బీజేపీ రావ‌డం గ‌మ‌నార్హం. సెంటిమెంట్ ను కాద‌ని ఒంట‌రిగా బ‌రిలోదిగిన బీజేపీ అభ్య‌ర్థి సురేష్‌ 21వేల‌కు పైగా ఓట్ల‌ను సంపాదించుకున్నారు. ఏపీలో వైసీఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీ అనే నినాదానికి ఈ ఫ‌లితాలు బ‌లం ఇస్తున్నాయని క‌మ‌ల‌నాథులు భావించ‌డం స‌హ‌జం.
బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉంది. జ‌న‌సేన పార్టీ బీజేపీకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి నిరాక‌రించింది. ఆ రెండు పార్టీలు సెంటిమెంట్‌, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాయి. బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంక‌ట‌సుబ్బ‌య్య గెలుపొందారు. ఇటీవ‌ల ఆయ‌న అకాల మ‌ర‌ణం పొందాడు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక‌లు అనివార్యం కావ‌డంతో వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ దాసరి సుధ‌కు వైసీపీ అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మ‌ర‌ణిస్తే, వాళ్ల కుటుంబం నుంచి ఎవ‌రైనా పోటీ చేస్తే ప్ర‌త్య‌ర్థి పార్టీలు దూరంగా ఉండే సంప్ర‌దాయం చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కొన‌సాగుతోంది. ఆ ప్ర‌కారం బీజేపీ మిన‌హా అన్ని పార్టీలు ఉప ఎన్నిక‌కు దూరంగా ఉన్నాయి.

రాజ‌కీయ వార‌స‌త్వాన్ని వ్య‌తిరేకించే బీజేపీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపింది. దీంతో వైసీపీ, బీజేపీ మ‌ధ్య పోటీ జ‌రిగింది. భారీ మోజార్టీని వైసీపీ అభ్య‌ర్థి సాధించ‌గా, బీజేపీ 21వేల ఓట్ల‌కుపైగా ద‌‌క్కించుకోవ‌డం విశేషం. ముఖ్య‌మంత్రి జ‌గన్మోహ‌న్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీకి వ‌చ్చిన ఓట్ల‌ను గ‌మ‌నిస్తే, రాబోవు రోజుల్లో టీడీపీ, జ‌న‌సేన‌కు పోటీగా బీజేపీ ఉంటుంద‌ని భావించ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ప్రస్తుత బీజేపీ లీడ‌ర్, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బ‌ద్వేల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఓట్ల‌ను రాబ‌ట్ట‌గ‌లిగారు. బీజేపీ, జ‌న‌సేన క‌లిసి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల త‌రువాత ఎక్క‌డ పోటీ చేసిన‌ప్ప‌టికీ డిపాజిట్లు ద‌క్క‌లేదు. ఆ రెండు పార్టీలు తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లోనూ డిపాజిట్ల‌ను రాబ‌ట్ట‌లేకపోయాయి. కానీ, బ‌ద్వేల్ లో జ‌న‌సేన దూరంగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ 21వేల‌కు పైగా ఓట్ల‌ను సంపాదించ‌డం ఏపీ రాజ‌కీయ చిత్రంలో హైలెట్ పాయింట్.

ప‌లుమార్లు(1999, 2004,2014) టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. 1999, 2014 ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోగ‌లిగాయి. క్షేత్ర‌స్థాయిలో బీజేపీ, టీడీపీ క్యాడ‌ర్ క‌లిసి ప‌నిచేయ‌డానికి అనుకూల‌మైన ప‌రిస్థితులు మాన‌సికంగా ఉంటాయి. జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణులు పొత్తు ఉన్న‌ప్ప‌టికీ 2019 నుంచి ప‌లుమార్లు అంత‌ర్గ‌తంగా విభేదించుకున్న సంద‌ర్భాలు అనేకం. త‌ద్భిన్నంగా టీడీపీ, బీజేపీ పొత్తు సామాన్యుల‌కు సైతం అతికిన‌ట్టు స‌రిపోతోంది. అందుకే, ఇప్పుడు టీడీపీ ఓట‌ర్లు గంప‌గుత్త‌గా బీజేపీకి ఓట్లు వేసుంటార‌ని విశ్లేష‌కులు భావ‌న‌. దానికి బ‌లం చేకూరేలా బ‌ద్వేల్ లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించింది. తాజాగా బ‌ద్వేల్ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. ఫలితంగా టీడీపీ ఓట‌ర్లు క‌మ‌లం వైపు కొంద‌రు, జ‌న‌సేన సైడు మ‌రికొంద‌రు అల‌వాటు ప‌డ్డారు. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో తెలంగాణ‌లోనూ జ‌రిగింది. 2009 ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మిని ఏర్పాటు చేసి టీఆర్ఎస్, తెలుగుదేశం క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. అప్ప‌టి వ‌ర‌కు వైరి వ‌ర్గంగా ఉండే టీడీపీ, టీఆర్ఎస్ శ్రేణులు చేతులు క‌ల‌ప‌డంతో సెంటిమెంట్ రూపంలో చివ‌‌ర‌కు తెలుగుదేశం భారీగా న‌ష్ట‌పోయింది.

ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఏపీలోనూ నెల‌కొందా? అనే అనుమానం రావ‌డానికి అస్కారం ఏర్ప‌డింది. సాధార‌ణంగా టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన శ్రేణుల మ‌ధ్య పెద్ద‌గా రాజ‌కీయ వైరం ఉండ‌దు. ఓట‌ర్లు కూడా మూడు పార్టీలు ఇంచుమించు ఒక‌టే అనే భావ‌న‌తో ఉంటారు. తాజాగా టీడీపీ, జ‌న‌సేన బ‌ద్వేల్ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డంతో వైసీపీ వ్య‌తిరేక ఓట‌ర్లు బీజేపీ వైపు మ‌ళ్లారు. అంటే, రాబోవు రోజుల్లో టీడీపీ, జ‌న‌సేన లేక‌పోతే బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ఆస్కారం ఉంద‌ని బ‌ద్వేల్ ఫ‌లితం బ‌ల‌మైన సంకేతం ఇస్తోంది. సో..ఇక బీజేపీ ఢిల్లీ అధిష్టానం రాజ‌కీయ మెరుపుదాడి ఎటువైపు నుంచి చేస్తుందో…చూద్దాం.!