AP BJP : బీజేపీ అధ్య‌క్షులుగా `సోము` ఔట్‌, మ‌రోసారి `బండి`?

బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల బోర్డు ఏర్ప‌డిన త‌రువాత రాష్ట్రాల‌కు సంబంధించిన ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుల‌ను కొన‌సాగిస్తారా? లేదా మార్పులు చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 19, 2022 / 02:00 PM IST

బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల బోర్డు ఏర్ప‌డిన త‌రువాత రాష్ట్రాల‌కు సంబంధించిన ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుల‌ను కొన‌సాగిస్తారా? లేదా మార్పులు చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడు ప్ర‌స్తుతం బండి సంజ‌య్ క్రేజ్ పెరుగుతోంద‌ని ఆ పార్టీ అంచ‌నా. ప్ర‌జా సంగ్రామ యాత్ర ద్వారా బీజేపీని క్షేత్ర‌స్థాయికి తీసుకెళ్లార‌ని క‌మ‌ల‌నాథులు విశ్వ‌సిస్తున్నారు. పైగా ఆయ‌న ఇటీవ‌ల నిర్వ‌హించిన బీజేపీ కేంద్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంద‌ర్భంగా సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన స‌భ‌ను విజ‌య‌వంతం చేశారు. ప్ర‌స్తుతం దూకుడుగా వెళుతోన్న ఆయ‌న్ను మ‌రోసారి కొన‌సాగించ‌డానికి అవ‌కాశం ఉంది. కొంద‌రు ఆ పార్టీలోని వాళ్లు వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ బండి సంజ‌య్ పై అధిష్టానం న‌మ్మ‌కంగా ఉంది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును అధ్యక్ష ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌ని చాలా కాలంగా టాక్ ఉంది. ఆ పార్టీలోని వాళ్లే ప‌లుమార్లు అధిష్టానంకు ఫిర్యాదులు చేసిన సంద‌ర్భాలు అనేకం. ఆయ‌న సార‌థ్యంలోని బీజేపీ పెద్ద‌గా ప్రాచుర్యం పొంద‌లేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌లు ఇత‌ర‌త్రా ప్ర‌భుత్వ వ్య‌తిరేక పోరాటాల విష‌యంలోనూ ఆయ‌న వెనుక‌బ‌డ్డార‌ని ఢిల్లీ పెద్ద‌ల అభిప్రాయమ‌ని చెప్పుకుంటున్నారు. ఆయ‌న కంటే ముందున్న అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు జేబులో మ‌నిషంటూ అప‌వాదును ఎదుర్కొన్నారు. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడుగా ఉన్న సోము వీర్రాజు వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌తిరూపంగా చాలా సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లను ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఏపీ బీజేపీ క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌లేక చ‌తికిల‌పడింది.

2024 ఎన్నిక‌ల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతాన‌ని ఇటీవ‌ల సోము వీర్రాజు చేసిన ప్ర‌క‌ట‌న బీజేపీ వ‌ర్గాల్లోనూ హాట్ హాట్ గా చ‌ర్చ న‌డిచింది. గత 42 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. సీఎం కావాల‌నే కోరిక ఏమీ లేదని అన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో తనకు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్‌తో పాటు మంత్రి పదవి ఆఫర్‌ చేశారని గుర్తు చేయ‌డం ఆ మ‌ధ్య క‌ల‌క‌లం రేపింది. బీజేపీ అధిష్టానం అస‌హ‌నంగా ఉండ‌డంతో ఆ విధంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేసుంటార‌ని క్యాడ‌ర్ చ‌ర్చించుకోవ‌డం అప్ప‌ట్లో వినిపించింది.

ప‌లుమార్లు ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన స‌మావేశాల్లోనూ సోము వీర్రాజు అధిష్టాన్ని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయార‌ట‌. ఒకానొక సంద‌ర్భంలో వైసీపీని వెన‌కేసుకొస్తోన్న ఆయ‌న‌పై అమిత్ షా మండిప‌డిన‌ట్టు కూడా న్యూస్ బ‌య‌టకు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలోనే రాజ‌కీయాల‌కు గుడ్ బై అంటూ సంచ‌ట‌న ప్ర‌క‌ట‌న ఆయ‌న చేయ‌డం చూశాం. ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆ రెండు పార్టీలు ఎప్పుడూ క‌లిసి ప‌నిచేయ‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో స‌మ‌న్వ‌యం చేయ‌డంలోనూ వీర్రాజు విఫ‌లం చెందారు. అక్క‌డ అభ్య‌ర్థిని ఎంపిక చేసే విష‌యంలో రెండు పార్టీలు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాయి. ఆ త‌రువాత బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం ప‌వ‌న్ అంటూ వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు ఢిల్లీ పెద్ద‌ల‌కు ఆగ్ర‌హం క‌లిగించాయ‌ని తెలుస్తోంది. తాజాగా జ‌రిగిన బ‌ద్వేల్, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన‌, బీజేపీ వేర్వేరుగా నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో వీర్రాజు అధ్య‌క్ష ప‌ద‌వి కొన‌సాగింపు దాదాపుగా ఉండ‌ద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం టీడీపీ, బీజేపీ ద‌గ్గ‌ర‌వుతోన్న వేళ వీర్రాజును దూరంగా పెడ‌తార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఉంటే రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు టీడీపీ , బీజేపీ మ‌ధ్య కుదిరే ఛాన్స్ త‌క్కువ‌. అందుకే, బ‌హుశా వీర్రాజు ఇటీవ‌ల చంద్ర‌బాబు విజ‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు అంటేనే భ‌గ్గుమ‌నే సోము తాజాగా స్వ‌రాన్ని స‌వ‌రించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ వీర్రాజును అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డానికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ, ఏపీ బీజేపీ సంస్థాగ‌త మార్పులు భారీగా ఉంటాయ‌ని స‌మాచారం. ఆ మార్పుల్లో వీర్రాజు ఔట్, బండి రైట్ రైట్ అంటూబీజేపీ వ‌ర్గాల్లోని వినికిడి. అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.