AP BJP Chief Madhav: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (AP BJP Chief Madhav) కడప జిల్లా నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘సారథ్యం’ అనే నూతన లక్ష్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుమల తొలి గడప అయిన కడప నుంచే తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
కడప ఎంపిక వెనుక గల కారణాలు
“తెలుగు భాష వెలుగులు తీసుకొచ్చిన కడపను ఎన్నుకున్నాం. వేలాది కీర్తనలు రాసిన తాళ్ళపాక అన్నమాచార్యులు, ప్రజాకవి యోగి వేమన, తెలుగును ప్రపంచానికి తెలిసేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ వంటి మహనీయులు నడయాడిన గడ్డ ఇది” అని మాధవ్ అన్నారు. కడప కేవలం సాహిత్య, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమే కాకుండా, రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని కడప నుంచే మొదలుపెట్టానని తెలిపారు.
‘సారథ్యం’ అంటే ఏమిటి?
తన సారథ్యంలో పార్టీ లక్ష్యాలను వివరిస్తూ “సారథ్యం అంటే… ప్రతి బీజేపీ కార్యకర్త సారథ్యంలో బీజేపీ సారథ్యం కావడమే లక్ష్యం” అని మాధవ్ స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కూడా బీజేపీ దేశం కోసం చేసిన ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై కేసు.. రూ. 5 కోట్లు కట్టాలని!
మోదీ ప్రభుత్వ విజయాలు, రాయలసీమ అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ ఆధునాతన నిర్మాణం జరిగిందని మాధవ్ కొనియాడారు. మోదీ లక్ష్యం ప్రతి వ్యక్తి జీవితంలో అవసరమైన ప్రతి ఒక్కటి అందించడమేనని అన్నారు. ప్రతి గ్రామానికి రెండు, మూడు కోట్లతో నిధులు సమకూర్చిన ఘనత మోదీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఉద్ఘాటించారు. కొప్పర్తి పారిశ్రామిక వాడకు వంద కోట్లు కేటాయించారని, బెంగళూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు అనేక జాతీయ రహదారులు రాయలసీమ మీదుగా వెళుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
కార్యకర్తలకు ప్రాధాన్యత
బీజేపీలో సాధారణ కార్యకర్తకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మాధవ్ అన్నారు. “అనేక సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి మేలు చేసేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. బీజేపీ జెండా ఎగరేయ్యాలనే తపనతో పనిచేసిన కార్యకర్తల వల్లే నేడు బీజేపీ అధికారంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. చిన్న కార్యకర్త అయిన తనను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం, అలాగే జాతీయ అధ్యక్షుడికి కూడా పెద్దగా తెలియకపోయినా, ఆయన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తగా ఎదగడం బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు
బీజేపీ జాతీయ పార్టీ అజెండాతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని మాధవ్ తెలిపారు. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వాన్ని టీడీపీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. “బీజేపీలో ప్రజా నాయకులను తయారు చేసే విధంగా ముందుకు వెళతాం. అందరం కలిసి బీజేపీకి వైభవాన్ని పెంచేలా పని చేయాలి” అని మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.